పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనపై కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్లో తలెత్తిన హింసపై ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిం చే విషయంలో అభిప్రాయం వెల్లడించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ఇదే విషయంలో బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీచేసింది. ఇలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన హింస కారణంగా శాంతిభద్రతలు క్షీణించడాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం విచారణకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. బెంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి, అంతర్గత అలజడుల నుంచి కాపాడటానికి సాయుధ/ పారామిలిటరీ బలగాలను దించడానికి కేంద్రానికి ఆదేశాలు జారీచేయాలని కూడా ఆ వ్యాజ్యం కోరింది. అంతేకాకుండా ఎన్నికల అనంతర హింసకు కారణాల గురించి దర్యాప్తు చేయడానికి ప్రత్యే క దర్యాప్తు బృందాన్ని (ఎస్ఐటి) నియమించాలని కూడా పేర్కొంది. హింస కారణంగా నష్టపోయిన బాధితులకు, వారి కుటుంబసభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాల్సిన విషయాన్ని కూడా వ్యాజ్యంలో ప్రస్తావించారు. కాగా ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు వినీత్ శరణ్, దినేశ్ మహేశ్వరి ఆధ్వర్యంలోని ధర్మాసనం కేంద్రం, బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మాత్రం నోటీసులు ఇవ్వలేదు. ఇలా ఉంటే వ్యాజ్యం బెంగాల్లో ఎన్నికల తర్వాత హింసకు సంబంధించిందని పిటిషనర్లు రంజనా అగ్నిహోత్రి, జితేందర్ సింగ్ తరఫున న్యాయవాది హరిశంకర్ జైన్ న్యాయస్థానానికి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి మద్దతుదార్లపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని, వేలాదిమందిని భయాందోళనలకు గురిచేసిన అసాధారణ పరిస్థితుల్లోనే వ్యాజ్యం దాఖలు చేశామని పిటిషనర్లు పేర్కొన్నారు. అందువల్ల దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు ప్రస్తుత పరిస్థితులను ముప్పుగా పరిగణిస్తూ బెంగాల్ విషయంలో కేంద్రం రాజ్యాంగ అధికరణలు 355, 356 ప్రసాదించిన అధికారాన్ని ఉపయోగించుకొనేలా ఆదేశించాలని వ్యాజ్యం న్యాయస్థానాన్ని కోరింది. మే 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే టిఎంసి కార్యకర్తలు, మద్దతుదారులు కేవలం బిజెపికి మద్దతిస్తున్నారన్న ఏకైక కారణంతో హిందువుల ఇళ్లు, ఆస్తులపై దాడులకు దిగారని పిటిషనర్లు వ్యాజ్యంలో ఆరోపించారు. కనీసం 15 మంది బిజెపి సానుభూతిపరులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది గాయపడ్డారని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించిందని ఆరోపించారు. కాగా ఈ అంశంలో సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే కొన్ని వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. బిజెపి కార్యకర్తల హత్యలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించింది.
మీ అభిప్రాయమేంటి?
RELATED ARTICLES