మీడియా పెడ ధోరణులు

వెబినార్‌లో వక్తల ఖండన
ప్రజాపక్షం / హైదరాబాద్‌ ప్రధాన వార్తలను పక్కనబెట్టి, చిన్న చిన్న వార్తలను ప్రధానమైనవిగా చేస్తూ మీడియా ఎజెండాను సెట్‌ చేస్తున్నాయని కేంద్ర ఆర్‌టిఐ మాజీ కమిషనర్‌, లా ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ విమర్శించారు. కంగనా రనావత్‌, శశిథరూర్‌- సునం దా పుష్కర్‌, రియా ముఖర్జీ వంటి చిన్న అంశాలను జాతీయ అంశాలుగా మార్చేస్తున్నాయన్నా రు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు ఇస్తున్న లీకుల ఆధారంగానే మీడియా ట్రయల్‌ జరుగుతుందే తప్ప జర్నలిస్టుల పరిశోధించి చేయడం లేదని, ఇది ప్రమాదరకరమైన ధోరణి అని హెచ్చరించారు. మీడియా ట్రయల్‌లో తమ లీకుల ద్వారా పోలీసులు, దర్యాప్తు సంస్థలు మీడియాను వాడుకుంటున్నాయనే విషయాన్ని జర్నలిస్టులు గమనించాలన్నారు. మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ , ఇండియా(మెఫీ) ఆధ్వర్యంలో సోమవారం వెబినార్‌ జరిగింది. మెఫీ, ఐజెయు అధ్యక్షులు కె. శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వెబినార్‌లో ‘సెలబ్రిటీల నేరాలపై మీడియా విచారణ సంచలనం కోసమేనా?’ అనే అంశంపై మాడభూషి శ్రీధర్‌ ప్రసంగించారు. నిరుద్యోగం, కొవిడ్‌, ఆర్థికం వంటి నిజమైన అంశాలను పక్కనబెట్టి మీడియా సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు వెంటపడ్డాయన్నారు. ఇందులో రియా ముఖర్జీని దోషిగా తేల్చేసి ప్రజల ముందు ఉంచుతున్నాయని, ఆమె కనీసం కేసులో నిందితురాలు లేదా అనుమానితురాలు కూడా కాదన్నారు. నిందితులకు కూడా హక్కులు ఉంటాయని, కేసు పూర్తయ్యే వరకు నిందితుని ముఖం కనిపించే ఫోటోలు ప్రసారం చేయవద్దనే నిబంధనలను కూడా మీడియా విస్మరిస్తోందన్నారు. మీడియానే ఫిర్యాదు చేసి, మీడియానే దర్యాప్తు చేసి, మీడియానే దోషులను నిర్ధారిస్తున్నదని, సుషాంత్‌, కంగనా ఎడిసోడ్‌లో మీడియా తిట్లు తినే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు సుషాంత్‌ సింగ్‌ కేసు నిలబడుతుందో లేదో కూడా మీడియా ట్రయల్‌తో మీడియాపై, మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించే పరిస్థితి వస్తుందని, దీనిపై జర్నలిస్టు సంఘాలు అప్రమత్తమై స్వీయ నియంత్రణ పాటించేందుకు చొరవ చూపాలని సూచించారు. పేదవాడిపై పెద్దవారి అరాచకాలను మీడియా పట్టించుకోదని, తిమింగలాలను వదిలేసి రంగురంగుల చిన్న చేపలనే పట్టుకుంటుందన్నారు. ఈ పరిస్థితికి మీడియా కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోవడమే కారణమని, రాజకీయ పార్టీలను కార్పొరేట్‌ సంస్థలే స్పాన్సర్‌ చేస్తున్నాయని, కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలే మీడియా ఎజెండాను నిర్ణయిస్తున్నాయని, ప్రజల్లో తప్పుడు అవగాహనను సృష్టిస్తున్నారని మాడభూషి శ్రీధర్‌ పేర్కొన్నారు. అందుకు ప్రధాని నెమలితో కలిసి ఉన్న వార్తలు వస్తున్నాయన్నారు. అమెరికాలో మీడియా ట్రయల్‌కు పరిమతులు ఉంటాయని తెలిపారు. మరోవైపు మీడియాకు ప్రభుత్వాలు పరువు నష్టం కాకుండా రాజద్రోహం వంటి కేసులు, న్యాయవ్యవస్థ నుండి కోర్టు ధిక్కార కేసు, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల నుండి ప్రైవసీ, కాపీ రైట్‌ వయోలేషన్‌ వంటి కేసుల ప్రమాదం పొంచి ఉన్నాయన్నారు. మెఫీ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో జర్నలిజం వృత్తి అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయిందని, ఇటీవల సెలబ్రిటీలపై వార్తలను పదే పదే చూపుతున్న తీరుతో సమాజంలో ఏవగింపునకు గురవుతున్నదన్నారు. గతంలో పెయిడ్‌ న్యూస్‌ అనే పెడధోరణనిని గుర్తించామని, ఇప్పుడు అది విస్తృతమై, విశృంఖలమైందని, యాజమాన్యాలు నిర్ణయించే అంశాల ఆధారంగానే జర్నలిజం నడుస్తున్నదన్నారు. సెలబ్రిటీల అంశంలో ఆర్థిక, వ్యాపార అంశాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. బ్రిటన్‌లో మీడియాకు సంబంధించి వేసిన 2011లో లార్డ్‌ జస్టిస్‌లెవిన్‌సన్‌ ఎంక్వయిరీ కమిషన్‌ జర్నలిజం వృత్తికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిందదని తెలిపారు. అలాంటి ఎంక్వయిరీ కమిషన్‌ ఏర్పాటు చేస్తేనే మన దేశంలో కూడా జర్నలిస్టుల పరిస్థితిపై స్పష్టత వస్తుందన్నారు. మెఫీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జాతీయ సలహాదారులు దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ మీడియాకు పునశ్చరణ, శిక్షణ ఇవ్వడంలో ప్రెస్‌ అకాడమీ బాధ్యతను విస్మరించినప్పుడు, దానిని పూరించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో మెఫీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీడియాకు సంబంధించి వర్తమాన అంశాలపై ప్రారంభించిన వెబినార్‌ సిరీస్‌ను కొనసాగిస్తామని వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?