HomeNewsBreaking News‘మిర్చి’ కూలీల బతుకులు దుర్భరం..!

‘మిర్చి’ కూలీల బతుకులు దుర్భరం..!

పొరుగు రాష్ట్రాల నుండి వలసలు వస్తున్న కూలీలు

ప్రజాపక్షం/మరిపెడ మిర్చి కూలీల బతుకులు దుర్భరంగా మారుతున్నట్లు వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మా రాష్ట్రాలలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పంటలు బాగా పండుతున్నాయి. ఈ ప్రాంతమంతా శుభ్రంగా పచ్చదనంతో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాల నుండి వందలాదిగా కూలీలు వలసలు వస్తున్నారు. వారు గత రెండు నెలల క్రితం వలస వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి ఉంది. వారిని ‘ప్రజాపక్షం’ పలకరించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి జీవిత గమనం అనేక సంవత్సరాల నుండి కూలీలుగానే
బతుకుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. దారిద్య్రం, పేదరిక నిర్మూలన చేస్తామని గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి లేకుండా కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముగాస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టిన 45 లక్షల కోట్ల బడ్జెట్‌లో భారీగా ఉపాధి కోత విధించారు. గత సంవత్సరం దేశం మొత్తంలో 85 లక్షల మందికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని చూపిన ప్రభుత్వం, నేడు 25 లక్షల మందికి ఉపాధి పనిదినాలను తగ్గిస్తూ నిధుల కొరత విధించింది. అంతేగాక గతంలో పనిచేసిన వాటికి బిల్లులు రాక వేలాదిమంది కార్మికులు వలస బాట పట్టారు. ఈ సందర్భంలోనే మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలానికి పొరుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్‌, రాజస్థాన్‌, తదితర రాష్ట్రాల నుండి ఎల్లంపేట, వీరారం, విస్సంపల్లి, ఉల్లేపల్లి, తానంచర్ల, బురహాన్‌ పురం, రాంపురం, చిల్లంచర్ల, నిలుకుర్తి, ఆనేపురం, స్టేజితండా, తదితర గ్రామాలకు వందలాదిమంది వలస కూలీలు వస్తున్నట్లు సంబంధిత రైతుల ద్వారా తెలుస్తుంది.
రోజుకు రూ.800 కూలి పూజా మిర్చికూలి (మహారాష్ట్ర)
ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు పనిచేస్తున్నట్లు మహారాష్ట్రకు చెందిన మిర్చి కూలి పూజ తెలిపారు. కెజికి పది రూపాయలు చొప్పున రోజుకు 800 నుండి 1000 కూలీ లభిస్తుందని తెలిపారు. డిగ్రీ వరకు చదువుకున్నా, అక్కడ ఉపాధి లేకపోవడంతో మిర్చితోట కూలికి వచ్చినట్లు ఆమె తెలిపారు.
మాకు పని దొరకడం లేదు : కమల మిర్చి కూలి(బల్లార్షా)
మా రాష్ట్రాలలో కూలి పని ఎక్కువ దొరకదని, ఎక్కువ శాతం మగవారు అంత వలసలు వెళతారని, ఈసారి మిర్చి కూలి కోసం మేము పిల్లలతో కలిసి ఇక్కడికి కూలికి వచ్చినట్లు మిర్చి కూలి కమల తెలిపారు. రోజుకు 600 నుండి 800 వరకు కూలి వస్తుందని తెలిపారు.
వలస కూలీలతోనే రైతుకు లాభం : భూక్య గోపానాయక్‌
వలస వచ్చిన కూలీల ద్వారా మిర్చి రైతుకు లాభం ఉందని ఉల్లే పల్లి భూక్యతండకు చెందిన గిరిజన రైతు ముఖ్య గోపాల్‌ నాయక్‌ తెలిపారు. వాళ్లు చెప్పిన టైంకి వస్తారు. మిర్చిని శుభ్రంగా ఎర్రగా పండిన పండ్లను మాత్రమే తెంపుతారని, రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనిచేస్తారని పేర్కొన్నారు. మా తోటను మూడు రోజులపాటు వేరినట్లు రైతు తెలిపారు. లోకల్‌ కూలీలు ఆకు, గడ్డి కలిపి బస్తాలు నింపుతారు. గట్టిగా మాట్లాడితే తెల్లారి కూలికి రారని తెలిపారు. గతంలో వారి ద్వారా నష్టపోయి ఉన్నాం కాబట్టి పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన కూలీలతో తొందరగా తోట ఏరుడు పూర్తవుతుందన్నారు. మొదట ఏరిన మిర్చికి గిట్టుబాటు ధర ఉంటుందని, ఆ ధర తగ్గితే పెట్టిన పెట్టుబడులు కూడా రావని బాధతో పొరుగు రాష్ట్రాల కూలీలకు ఆశ్రమం కోరినట్లు ఆయన తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments