వేరుశనగ సాగుపై రైతుల దృష్టి : అపరాల వైపు మొగ్గు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తే.. అతివృష్టి ఈ ఏడాది వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది. అది ఇది అనే భేదం లేకుండా ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ అతివృష్టి బారినపడ్డాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. వరి, పత్తి, అపరాలు మొదలైన ప్రధాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. పత్తి ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడి కావడం లేదు. వరి ముఖ్యంగా సన్న రకం దిగుబడి తగ్గిపోయింది. ఇతర రకాలు కాస్తా ఫర్వాలేదనిపించాయి. ఖరీఫ్‌లో వేసిన పెసర, మినుముకు సంబంధించి విత్తనం కూడా రాలేదు. ఎకరాలకు ఎకరాలు వదిలేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రైతుల ఆశలన్నీ మిర్చిపైనే ఉన్నాయి. మొదట్లో వర్షాలకు మొక్క బతకక రైతులకు పెట్టుబడి పెరిగింది. పలుమార్లు మొక్క తిరిగి నాటాల్సి రావడంతో అదనపు పెట్టుబడి అయింది. దీనికి తోడు ఈ ఏడాది దొబ్బరోగం కూడా మిర్చి పంట ఎదుగుదలను అడ్డుకుంది. డిసెంబర్ మాసం మధ్య నుంచి ఎటువంటి తెగుళ్లు రాకపోవడంతో మిర్చి తోటలు కళకళలాడుతున్నా యి. ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో మిర్చి అయినా ఆదుకోకపోతుందా అన్న ఆశ తో రైతులు ఉన్నారు. యాసంగి పంటలకు సంబంధించి చాలా కాలం తర్వాత వేరుశనగ పంటపై రైతులు దృష్టి సారించారు. పత్తి పంట తొలగించిన తర్వాత రెండవ పంటగా రైతులు మొక్కజొన్నను సాగు చేసే వారు. ఖరీఫ్‌లో పండించిన మొక్కజొన్నలనే కొనేవారు లేకపోవడంతో యాసంగిలో మొక్కజొన్నను సాగు చేసేందుకు జంకుతున్నారు. మచ్చ తెగుళ్లతో దిగుబడి తగ్గిపోతుందని వదిలేసినా వేరుశనగ పంట పట్ల చాలా కాలం తర్వాత రైతులు ఆకర్షితులవుతున్నారు. మార్కెట్‌లో వేరుశనగకు డిమాండ్ ఉండడంతో తిరిగి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెప్పించిన మినుములను కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వీటిని విత్తేందుకు ప్రత్యేక యంత్రాలు రావడం విశేషం. మొత్తంగా యాసంగి మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా తగ్గగా, వేరుశనగ, అపరాల సాగు పెరిగింది.
మిర్చిపైనే ఆశలు
RELATED ARTICLES