HomeNewsBreaking Newsమిథాలీ సేన జయభేరి

మిథాలీ సేన జయభేరి

ఏక్తా మ్యాజిక్‌.. రాణించిన జెమీమా, ఇంగ్లాండ్‌పై
భారత్‌ ఘన విజయం
ఐసిసి మహిళల వన్డే చాంపియన్‌షిప్‌

ముంబయి: ఐసిసి మహిళల వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. భారత బౌలర్‌ ఏక్తా బిష్త్‌ (4/25) విజృంభించడంతో ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు (49.4 ఓవర్లలో) 202 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాలో జెమీమా రొడ్రిగ్స్‌ (48; 58 బంతుల్లో 8 ఫోర్లు), మిథాలీ రాజ్‌ (44; 74 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కు భారత స్పిన్నర్లు ముప్పతిప్పలు పెట్టారు. ముఖ్యంగా ఏక్తా బిష్త్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో ఇంగ్లాండ్‌ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్‌ బ్యాట్స్‌వుమెన్స్‌లో నటాలి స్కైవెర్‌ (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఫలితంగా టీమిండియాకు భారీ విజయం దక్కింది. బౌల్‌తో మెరిసిన ఏక్తా బిష్త్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1 ఆధిక్యం సాధించింది. సోమవారం ఇదే వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది.
ఆరంభంలోనే షాక్‌..
భారత్‌ నిర్ధేశించిన 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. కుదురుగా ఆడుతున్న ఓపెనర్‌ ఆమీ ఎలెన్‌ జోనెస్‌ (1)ను శిఖా పాండే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ పంపింది. దీంతో ఇంగ్లాండ్‌ 5 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత అదే జోరును కొనసాగించిన శిఖా పాండే సారా టేలర్‌ (10)ను కూడా ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ మరో షాకిచ్చింది. అనంతరం దీప్తి శర్మ తెలివైన బంతితో బాధ్యతగా ఆడుతున్న ఓపెనర్‌ టామి బియోమొంట్‌ (32 బంతుల్లో 18)ను పెవిలియన్‌కు పంపింది. దీంతో ఇంగ్లాండ్‌ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హేదర్‌ నైట్‌, నటాలి వ్యాట్‌ ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. తమ తమ వికెట్లను కాపాడుకుంటూనే సింగిల్స్‌, డబుల్స్‌తో స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ పోయారు. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ ముందుకు సాగారు. ఈక్రమంలోనే వీరు నాలుగో వికెట్‌కు కీలకమైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఇదే క్రమంలో ఇంగ్లాండ్‌ టీమ్‌ స్కోరు కూడా 28.2 ఓవర్లలో 100 పరుగులు దాటింది.
చెలరేగిన ఏక్తా..
అద్భుతంగా రాణిస్తూ నాలుగో వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్న ఈ జంట టీమిండియాకు తలనొప్పిగా మారింది. చివరికి ఈ సమయంలో స్పిన్నర్‌ ఏక్తా బిష్త్‌ తన అద్భుతమైన ప్రతిభతో టీమిండియాను కష్టాల్లోనుంచి బయటకు తీసింది. ముందు ప్రమాదకరంగా మారిన ఈ కీలక జోడీని రనౌట్‌గా విడదీసింది. దీంతో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న నటాలి స్కైవెర్‌ (44; 66 బంతుల్లో 5 ఫోర్లు) పెవిలియన్‌ బాట పట్టింది. 111 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ 4వ వికెట్‌ కోల్పోయింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. తర్వాత మరింతగా చెలరేగిన ఎక్తా బిష్త్‌ వరుసక్రమంలో వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌ను హడలెత్తించింది. తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లీష్‌ బ్యాట్స్‌వుమెన్స్‌లపై ఎదురుదాడికి దిగింది. దీంతో తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ కూడా రెండంకెల స్కోరు మార్కును దాటలేక పోయారు. ఎక్తా ధాటికి బ్రంట్‌ (7) పరుగులకు పెవిలియన్‌ చేరగా.. ఆన్య షోర్బ్‌సొలే (0), సోఫీ ఎక్లేస్టన్‌ (0), అలెక్స్‌ హర్ట్‌లీ (0) ముగ్గురు ఖాతా తెరవకుండానే ఇంటి ముఖం పట్టారు. మరోవైపు డానియల్‌ వ్యాట్‌ (1)ను దీప్తి శర్మ, జార్జియా ఎల్వీస్‌ (6)ను ఝులన్‌ గోస్వామి ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ జట్టు 136 పరుగులకు ఆలౌటైంది. చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్‌ సారథి హేదర్‌ నైట్‌ (39) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో విజృంభించి బౌలింగ్‌ చేసిన ఏక్తా బిష్త్‌ 8 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఇతర బౌలర్లలో శిఖా పాండే, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. ఝులన్‌ గోస్వామి ఒక వికెట్‌ దక్కించుకుంది.
శుభారంభం..
శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టాస్‌ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌కు ఓపెనర్లు జెమీమా రొడ్రిగ్స్‌, స్మృతి మంధనా శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ అరంభం నుంచే ధాటిగా ఆడుతూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదరుదాడికి దిగారు. ఈ మ్యాచ్‌లో స్మృతి తన శైలికి భిన్నంగా కుదురుగా ఆడుతుంటే.. మరోవైపు జెమీమా మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించింది. ఈ క్రమంలోనే భారత జట్టు 10.3 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసుకుంది. తర్వాత ఈ జంటను విడదీయడానికి ఇంగ్లాండ్‌ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరికి వారికి ఫలితం దక్కింది. కుదురుగా ఆడుతున్న భారత స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధనా (42 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు)ను ఎల్వీస్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. దీంతో భారత్‌ 69 పరుగుల తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన దీప్తి శర్మ (7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయింది. దీంతో టీమిండియా 85 పరుగల వద్ద రెండో వికెట్‌ చేజార్చుకుంది. తర్వాత పుంజుకున్న ఇంగ్లాండ్‌ బౌలర్లు మరింతగా చెలరేగి బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి హర్లీన్‌ డియోల్‌ (2), మోన మెష్రమ్‌ (0) వెనువెంటనే పెవిలియన్‌ చేరారు. మరోవైపు దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ జెమీమా రొడ్రిగ్స్‌ (48; 58 బంతుల్లో 8 ఫోర్లు) కూడా వెనుదిరగడంతో భారత్‌ 95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న మిథాలీ, తానియ..
ఈ సమయంలో భారత సారథి మిథాలీ రాజ్‌, వికెట్‌ కీపర్‌ తానియ భాటియా అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పోయారు. మరోవైపు సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఆరంభంలో సమన్వయంతో ఆడిన వీరు తర్వాత మెల్లమెల్లగా తమ పరుగుల వేగాన్ని పెంచారు. అవకాశం లభించినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలుగా మరల్చుతూ స్కోరుబోర్డును పరిగెత్తించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఆరో వికెట్‌కు కీలకమైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుని జట్టును ఆదుకున్నారు. అనంతరం ధాటిగా ఆడుతున్న తానియ భాటియా (25)ను నటాష రనౌట్‌ చేసి ఈ జంటను విడదీసింది. దీంతో టీమిండియా 149 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. తర్వాత కొద్దిసేపటికే బాధ్యతగా ఆడుతున్న కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (44; 74 బంతులో 4 ఫోర్లు) కూడా ఔటవడంతో మరోసారి టీమిండియా పరుగుల వేగం తగ్గింది. చివర్లో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న భారత్‌ తక్కువ స్కోరుకే కట్టడి అయింది. కానీ ఆఖర్లో భారత సీనియర్‌ ప్లేయర్‌ ఝులన్‌ గోస్వామి (30; 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగి ఆడడంతో టీమిండియా స్కోరు 200 పరుగుల మార్కును దాటగలిగింది. దీంతో భారత్‌ 49.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జార్జియా ఎల్వీస్‌, నటాలీ స్కైవర్‌, సోఫీ తలో రెండు వికెట్లు తీశారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments