HomeNewsBreaking Newsమాస్టర్‌ప్లాన్‌ ఉసురు తీసింది!

మాస్టర్‌ప్లాన్‌ ఉసురు తీసింది!

భూమి పోతుందని ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య
రాములు మృతితో రైతుల ఆగ్రహం
మున్సిపల్‌ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌
ప్రజాపక్షం/కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఓ రైతు కుటుంబంలో విషాదాన్ని నింపింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మాస్టర్‌ప్లాన్‌ బాధిత రైతు పయ్యావుల రామలు(38) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఇండస్ట్రియల్‌ జోన్‌ కింద ఇల్చిపూర్‌ శివారులో రామలుకు 1.20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కోల్పోతుండటంతో మనస్తాపం చెందిన రాములు బుధవారం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాములు మృతితో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతదేహంతో న్యూబస్టాండ్‌ చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించారు. తన భూమి తన కుటుంబ సభ్యులకు చెందేలా చూడాలని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో రైతు రాములు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యతతో ఒక్కసారిగా అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ వల్ల భూములు పోతున్న రైతులు తమ భవిష్యత్‌ ఏమిటో అర్థం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రాములు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు లేకుండానే పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని నిరసిస్తూ మృతుని భార్య, పిల్లలు, కుటుంబసభ్యులతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్‌, బిజెపి నాయకులు మున్సిపల్‌ కార్యాలయం ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని అధికారులకు, పాలకులకు పలుమార్లు విన్నవించినా వారు పట్టించుకోకపోవడంతో రాములు తన భూమి పోతుందని ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రభుత్వం పునరాలోచించి మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. రైతు రాములు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో మాస్టర్‌ప్లాన్‌లో భూమి కోల్పోతున్న రైతు కుటుంబాలు పాల్గొని మద్దతు తెలుపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్దఎత్తున పోలీసులను మోహరించి ఆందోళనకారులను సముదాయించినప్పటికీ వారు శాంతించలేదు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments