మావోయిస్టుల వ్యూహంలో జవాన్లు

ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : పోలీసులను మావోయిస్టులు కవ్వించడం, ఎరవేసి తమ వలలో చిక్కేలా చేసుకోవడం చాలా ఏళ్ల నుంచి దండకారణ్యంలో జరుగుతున్నదే. కానీ ఈసారి “యు” ఆకారంలో వలపన్ని మావోయిస్టులే సమాచారం ఇచ్చి పోలీసులను రప్పించి హతమార్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. నక్సల్స్‌ వ్యూహానికి చిక్కిన పోలీసులు విలవిలలాడారు. దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోగా మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టుల మెరుపుదాడికి భద్రత బలగాలు కోలుకోలేకపోయాయి. వివరాల్లోకి వెళితే… ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 23 మంది జవాన్లు మరణించారు. ఆదివారం సాయంత్రానికి కూడా పూర్తి సమాచారం అందలేదు. అక్కడి పోలీస్‌ అధికారులు చెబుతున్న సమాచారం మేరకు బీజాపూర్‌, సుక్మా జిల్లాల సరిహద్దులోని తొర్రెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని దీనికి మావోయిస్టు అగ్రనేతలు హాజరయ్యారన్న సమాచారాన్ని కొంత మంది వేగుల ద్వారా మావోయిస్టులు పోలీసులకు చేరవేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సమావేశమైన మావోయిస్టులను లొంగదీసుకునేందుకు కూంబింగ్‌ ప్రారంభించి ఆ వైపుకు అడుగులు వేశారు. కానీ అప్పటికే మావోయిస్టులు ‘యు’ఆకారంలో ఒక రక్షణ వలయంగా ఏర్పడి పోలీసులను చుట్టు ముట్టారు. అతి సమీపం నుండి మోటార్‌ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. ఎకె- 47, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులతో మావోయిస్టులపై విరుచుపడ్డారు. ఎన్‌కౌంటర్‌ జరిగిందని భావిస్తున్న ఓ విప్పచెట్టు కింద పెద్ద సంఖ్యలో పోలీసుల మృతదేహాలు పడి ఉండడం గమనార్హం. పలువురు ఈ ఘటనలో గాయపడి బీజాపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్‌కౌంటర్‌ ఘటన జరిగిన సమయంలో దాదాపు 400 మంది సాయుధ నక్సల్స్‌ ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. “యు” ఆకారంలో మావోయిస్టులు వల పన్నగా ఆ దెబ్బకు పోలీసులు విలవిలలాడి ఎటు పోవాలో అర్థంకాక చెల్లాచెదురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా బస్తార్‌ ఐజి సుందర్‌రాజు ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు కూడా మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఛత్తీస్‌గఢ్‌ సిఎంతో ఫోన్‌లో మాట్లాడారు. డిఐజిని ఘటన స్థలంకు వెళ్లి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించారని తెలుస్తుంది. చాలా కాలం తర్వాత మావోలు వ్యూహాత్మకంగా వ్యవహరించి భద్రత దళాలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

DO YOU LIKE THIS ARTICLE?