మావోయిస్టులను ఏరివేస్తాం

బస్తర్‌ పర్యటనలో హోంమంత్రి అమిత్‌ షా స్పష్టీకరణ

జగదల్‌పుర్‌: నక్సల్‌ ప్రమాదాన్ని నిర్మూలించేందుకు మావోయిస్టులపై పోరాటం ఉధృతం చేస్తామని హోం మంత్రి అమిత్‌ షా సోమవారం స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది చనిపోయిన ఘటనపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వామపక్ష తీవ్రవాదంపై జగదల్‌పుర్‌లో జరిగిన ఒక అత్యున్నత సమావేశానికి షా అధ్యక్షత వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పోరాటం నిర్ణయాత్మక మలుపునకు తీసుకువెళ్లేందుకు భద్రతా సిబ్బంది త్యాగాలను గుర్తుంచుకుంటామని షా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌, రాష్ట్ర పోలీస్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) సీనియర్‌ అధికారులు పాల్గొన్నా రు. బస్తర్‌ ప్రాంతంలో సుక్మా, బిజాపుర్‌ సరిహద్దుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి, నక్సల్స్‌కు మధ్య శనివారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో 22 మంది భద్ర తా సిబ్బంది మరణించగా, ఒకరి జాడ ఇంకా తెలియరాలేదు.
ఆశాభంగంతోనే ఇలాంటి పనులు
గత కొన్నేళ్లుగా నక్సల్స్‌పై పోరాటం నిర్ణయాత్మక మలుపు తీసుకుందని, ఈ దురదృష్టకరమైన సంఘటన దానిని మరో రెండు అడుగులు ముందుకు తీసుకువెళ్లిందని షా తెలిపారు. అయి తే ఈ పోరాటం ఉధృతికి ఆటంకాలు కలగకుండా చూడాలని షా సూచించారు. మారుమూల ప్రాం తాల్లో భద్రతా దళాల శిబిరాలు ఏర్పాటుచేయడంలో గత ఐదారేళ్లుగా తాము విజయం సాధించామని ఆయన అన్నారు. మావోయిస్టు కంచుకోటల్లోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొచ్చుకు వెళ్తున్నాయని, అందువల్ల వారికి ఆశాభంగం కలగడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని షా వెల్లడించారు. అభివృద్ధిపరంగా కూడా కొన్ని పనులు జరగుతున్నాయని, కరోనా వల్ల వాటిలో వేగం కొంతమేరకు మందగించిందని ఆయన అన్నారు. అయితే రాష్ట్రానికి చెందిన గిరిజన ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి, ఎంపిల నుంచి వచ్చిన సలహాలు అన్నింటిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
బస్తర్‌కు తొలి పర్యటన
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చర్యలు, మావోయిస్టులపై ఉధృతమైన చర్యలనే రెండు కోణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నట్లు షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నక్సల్స్‌పై పోరాటానికి తార్కికమైన ముగింపునకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కాగా, నక్సల్స్‌పై పోరాటంలో విజయం సాధిస్తామని షా పేర్కొన్నారు. సమావేశానికి ముందు ఆయన భద్రతా సిబ్బందికి పుష్ప గుచ్ఛాలు సమర్పించే వేడుకలో పాల్గొన్నారు. ఇలా ఉంటే హోం మంత్రి పదవి చేపట్టాక బస్తర్‌ ప్రాంతానికి జరిపిన తొలి పర్యటన ఇదే అని ఒక అధికారి తెలిపారు. ఆ తర్వాత ఆయన బసాగుడ క్యాంపు చేరుకొని సిఆర్‌పిఎఫ్‌ జవాన్లతో మంతనాలు జరిపారు. వారితో కలిసి భోజనం చేసిన తర్వాత ఆయన రాయ్‌పుర్‌ చేరుకొని క్షతగాత్రుల్ని సందర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?