రికార్డు చేసిన ఇన్సైట్ స్పేస్‌క్రాఫ్ట్
వాషింగ్టన్: మార్స్ (అంగారక గ్రహం) నుంచి శబ్ధాలు విన్పించాయి. ఇలా శబ్ధాలు రికార్డు చేయడం ఇదే ప్రప్రథమం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల అంగారకుడిపైకి పంపిన ఇన్సైట్ స్పేస్‌క్రాఫ్ట్ నవంబరు 26వ తేదీన మార్స్‌పై ల్యాండ్ అయిన విషయం తెల్సిందే. ఇప్పటివరకు మార్స్‌పై రోవర్లు ల్యాండ్ అయినా, స్పేస్‌క్రాఫ్ట్ దిగడం ఇదే మొదటిసారి. ఈ ల్యాండర్ తాజాగా మార్స్ గ్రహంపై గాలి తరంగాల శబ్దాలను రికార్డు చేసింది. అంగారకుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ మార్స్‌పై విజయవంతంగా దిగిన తర్వాత పరిసరాల్లోని ఫొటోలు పంపింది. అయితే తొలిసారిగా అంగారకుడిపై గాలి శబ్దాలను రికార్డు చేయగలిగిందని నాసా వెల్లడించింది. గాలులు బలంగా వీస్తున్న తరంగాలు ఇన్సైట్ ల్యాండర్లో నమోదయ్యాయని, ఇన్సైట్ సోలార్‌ప్యానెల్స్ పై నుంచి గంటకు 10 నుంచి 15 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు రికార్డయిందని తెలిపింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని రెండు సెన్సార్లు గాలి తరంగాల శబ్దాలను నమోదు చేశాయని.. ఇన్సైట్ లోపల ఉన్న గాలి పీడన సెన్సార్, ల్యాండర్స్ డెక్‌పై ఉన్న సెస్మోమీటర్ సెన్సార్లలో అవి రికార్డయ్యాయని నాసా స్పష్టంచేసింది. అందులో నమోదైన శబ్దాలు గాలిలో జెండా ఎగుతున్నప్పుడు వచ్చిన శబ్దాల మాదిరిగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు థామస్ పైక్ వెల్లడించారు. అంగారక గ్రహంలోని రాతి పొరల నిర్మాణాలను పరిశోధించడానికి, అక్కడి భూ కంపాలు తదితర విషయాలను తెలుసుకోవడానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. వారం రోజుల క్రితం మార్స్‌పై నాసా విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇన్సైట్ స్పేస్‌క్రాఫ్ట్ పనిచేయడం ప్రారంభించింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన రోబోటిక్ ఆర్మ్ దాదాపు ఆరడుగుల మేరకు పైకి లేచి, ఇదివరకే కొన్ని పరికరాలను పట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నామని నాసా శాస్త్రవేత్తలు శుక్రవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మార్స్ ఉపరితలంపై ఎలీజియం ప్లానీషియా అనే ప్రాంతంలో ఇన్‌సైట్‌ను నాసా దించిన విషయం తెల్సిందే. రోబోటిక్ ఆర్మ్ తన పనిని మొదలుపెట్టడంతో నాసా శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు. ఇన్సైట్ ల్యాండ్ అయ్యాక అది కాస్త పక్కకు ఒరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత దానిపై పలు అనుమానాలు వ్యక్తమైన విషయం తెల్సిందే.
మార్స్ నుంచి శబ్ధాలు!
RELATED ARTICLES