HomeNewsLatest Newsమాట ఇచ్చాం... నెరవేర్చాం..

మాట ఇచ్చాం… నెరవేర్చాం..

దేశం అబ్బురపడేలా రుణమాఫీ
బిజెపికి 8 ఎంపి సీట్లు ఇస్తే గాడిద గుడ్డు ఇచ్చింది
రైతుల ఆత్మీయ సదస్సులో సిఎం రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/ ఖమ్మం
భారతదేశం అబ్బురపడేలా దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా రుణమాఫీ చేశామని రూ.31వేల కోట్ల రైతు రుణాలను రద్దు చేసి రుణ విముక్తులను చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. మే ఆరు 2022న వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ చెప్పినవిధంగా ఎనిమిది నెలల్లోన రుణమాఫీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గురువారం ఖమ్మంజిల్లా వైరాలో జరిగిన రైతుల ఆత్మీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చిన సోనియా గాంధీ 2014లో మాట నిలుపుకున్నారని అలానే పార్లమెంటు ఎన్నికల సందర్బంగా ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని భద్రాద్రి రామయ్య సాక్షిగా చెప్పిన దానిని నెరవేర్చామని ఆయన అన్నారు. ఇప్పటికే రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రుణమాఫీ, ఉచిత బస్సు, గృహ జ్యోతి, రూ.10లక్షలకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పెంపు తదితర పథకాలను అమలు చేస్తున్నామని ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రతి నియోజక వర్గంలోను 3,500 ఇండ్లు నిర్మిస్తామని రాష్ట్రం మొత్తం 4.50 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటిని ముందుకు నడుపుతున్నామన్నారు. ఖమ్మంజిల్లాకు మున్నేరు గ్రావిటి ద్వారా 32 టిఎంసిల నీటిని అందించేందుకు పరిశీలన చేస్తున్నామని నిపుణుల నివేదిక తర్వాత దీనిపై చర్చిస్తామన్నారు. పక్కనే ఉన్న డోర్నకల్‌ ప్రాంతానికి నీటిని అందించేందుకు 15 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను కురవి వీరభద్ర స్వామి పేరుతో నిర్మించేందుకు పరిశీలన చేస్తున్నామన్నారు. ఒకటిన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడమే గాక ఇప్పటికే 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మరో 65వేల ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టామన్నారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టిన బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసి తిప్పారని చంటి బిడ్డను తండ్రిని చూపేందుకు వచ్చిన మహిళ పట్ల అప్పటి పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. వేల కోట్ల రూపాయలు దండుకుని వదిలేశారని జవాబుదారి తనం లేకుండా ప్రాజెక్టులు ఇష్టానుసారంగా నిర్మించారన్నారు. కేటిఆర్‌, హరీష్‌ వి బోగస్‌ మాటలని కనీస అనుమతులు సీతారామకు పొందలేకపోయారని రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్బంగా ఏడు నియోజక వర్గాల్లో డిపాజిట్‌ కోల్పోయిన ఇంకా బిఆర్‌ఎస్‌కు సిగ్గు రాలేదన్నారు. చేతకానితనాన్ని సరిదిద్దుకోకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments