మహిళలకు… ఉద్యమ పగ్గాలు

రైతు ఆందోళనలో నేడు ప్రత్యేక గౌరవం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా వంద రోజులకుపైగా సాగుతున్న రైతుల ఉద్యమ పగ్గాలను సోమవారం అందరూ మహిళలే చేపట్టనున్నారు. భారతదేశ సేద్యరంగంలో పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువగా కష్టపడుతూ కోట్లాది మందికి అన్నం పెడుతూ అన్నపూర్ణలుగా నిలిచే అమ్మల కష్టానికి మహిళా దినోత్సవం సందర్భంగా అన్నదాతల ఆందోళన పగ్గాలు అప్పగించడం వారి కృషికి పట్టే నీరాజనమే. ఈ క్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని సరిహద్దుల్లో ఉన్న నిరసన స్థలాల్లో వేదికల నిర్వహణ మొదలుకొని ఆహారం, భద్రత,తమ పోరాటాల కథలు పంచుకోవడం, రైతు ఉద్యమంలో భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత వివరించడం వరకు సోమవారం జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ వేలాది మంది మహిళా రైతులు, విద్యార్థులు, ఉద్యమకారులు ముఖ్యపాత్ర పోషించనున్నారు. దేశ సాగురంగంలో మహిళలు గణనీయంగా తోడ్పాటును అందిస్తున్నారు. వారి కృషికి గౌరవంగా రైతు సంఘాల నాయకులు ఉద్యమంలో మహిళలను కీలకంగా నిలబెట్టేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందించారు. రైతు సమాజంలో మహిళల పాత్ర “పెద్దదే, కానీ గుర్తింపునకు నోచుకోనిది” అని రైతు నాయకులు అంగీకరించారు.
వేలాది మంది మహిళా రైతులు, ప్రధానంగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందినవాళ్లు సోమవారం ఢిల్లీ సరిహద్దుల్లో ఒక్క దగ్గరికి చేరనున్నారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజును పూర్తిగా మహిళా రైతులు, ఉద్యమకారులు, విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు రైతు నాయకులు పేర్కొన్నారు. ప్రతి ఏటా మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళల విజయాలను ప్రపంచవ్యాప్తంగా వేడుకగా నిర్వహించుకుంటారన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే “మహిళా దినోత్సవం సందర్భంగా వేదికను మహిళలే నిర్వహిస్తారు. వక్తలు కూడా మహిళలే. సింఘు సరిహద్దుల్లో చిన్నపాటి మహిళా పాదయాత్ర కూడా ఉంటుంది. నిరసన స్థలాలకు మరింతమంది మహిళలు చేరుకుంటారని అంచనావేస్తున్నాం” అని సీనియర్‌ రైతు నాయకురాలు కవితా కురుగంటి వెల్లడించారు. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా సింఘు, టిక్రీ సరిహద్దులకు కళాశాల ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులు, సామాజిక ఉద్యమకారులతో సహా దాదాపు 15,000 మంది మహిళా రైతులు చేరుకోనున్నారని ఉద్యమ నిర్వాహకులు తెలిపారు. రైతు సమాజంలో మహిళలు ప్రధాన పాత్రధారులైనప్పటికీ, వారికి తగిన గుర్తింపు దక్కలేదని, నిజానికి పొలాల్లో మహిళలే పురుషుల కంటే ఎక్కువ పనిచేస్తారని ఓ రైతు నాయకుడు అభిప్రాయపడ్డారు. వివాదాస్పద కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా వేలాదిమంది రైతులు ఢిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రీ, ఘాజీపుర్‌లో వందరోజులకుపైగా నిరసనచేస్తున్న విషయం తెలిసిందే. ఇక చట్టాలను మొత్తానికే రద్దుచేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవి మద్దతు ధరకు గండి కొడతాయని, తమను బడా కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలకు వదిలేస్తాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం కొత్త చట్టాలు రైతులకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయని వాదిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?