మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా
కోర్టు ఉత్తర్వు మేరకే తప్పుకుంటున్నట్లు అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడి
హోంశాఖ బాధ్యతలు దిలీప్ వాల్సే పాటిల్‌కు అప్పగింత
ముంబయి: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశా రు. మాజీ ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆయనపై బలవంతపు వసూళ్ల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బొం బాయి హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను సిఎం ఉద్ధవ్ థాక్రేకు సమర్పించారు. న్యాయస్థానం ఉత్తర్వు లు జారీచేశాక పదవిలో కొనసాగేందుకు తనకు అర్హత లేదని పేర్కొన్నారు. తనను పదవి నుంచి తప్పించమని దేశ్‌ముఖ్ తన లేఖలో విజ్ఞప్తిచేశారు. సిబిఐ దర్యాప్తు జరగనుండటంతో పదవి లో కొనసాగడం మంచిది కాదని, తాను నిర్ణయించుకున్నట్లు న్యాయస్థానం ఉత్తర్వుల తర్వాత ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌తో అన్నారు. రాజీనామాకు పవార్ ఆమోదం తెలిపాక దేశ్‌ముఖ్ ఠాక్రే దగ్గరికి వెళ్లారు. కాగా, పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు నిరాధారమని, అయితే పార్టీ కోర్టు ఆదేశాలు గౌరవిస్తుందని, అందుకే దేశ్‌ముఖ్ రాజీనామా చేశారని ఎన్‌సిపి మంత్రి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. కాగా, హోంమంత్రి రాజీనామా ఆమోదం పొందింది. ఆ శాఖ బాధ్యతలను మంత్రి దిలీప్ పాటిల్‌కు అప్పగించారు.
పోలీసు అధికారి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముం బయి మాజీ పోలీస్ కమిషనర్ చేసిన అవినీతి, దుష్ప్రవర్తన ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టాలని బొంబాయి హైకోర్టు సోమవారం సిబిఐని ఆదేశించింది. విచారణకు 15 రోజుల గడువు విధించింది. ఆ తర్వాతే ఈ కేసులో తదుపరి చర్యలను తీసుకుంటామని పేర్కొంది. హోం మంత్రి చర్యలను అసాధారణం, అనూహ్యం అని పేర్కొన్న ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, న్యాయమూర్తి జిఎస్ కులకర్ణి ధర్మాసనం స్వతంత్ర విచారణ అవసరమని వ్యాఖ్యానించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినందువల్ల, ఈ కేసులో సిబిఐ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. పరమ్ బీర్ సింగ్, ఇంకా ముంబయి న్యాయవాదులు జయశ్రీ పాటిల్, ఘనశ్యామ్ ఉపాధ్యాయ, స్థానిక ఉపాధ్యాయుడు మోహన్ భీడే దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలపై (పిఐఎల్) విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పును వెలువరించింది. ముంబయిలోని బార్లు, రెస్టరెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సిందిగా అనిల్ దేశ్‌ముఖ్ పోలీస్ అధికారులను అడిగినట్లుగా, ఈ విషయంలో ఆయనపై సిబిఐ దర్యాప్తును కోరుతూ మార్చి 25న పరమ్ బీర్ సింగ్ బొంబాయి హైకోర్టులో ఒక క్రిమినల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. కాగా తానే తప్పూ చేయలేదని దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. ఇలా ఉంటే రాజకీయ నాయకుల జోక్యం వల్ల మొత్తం పోలీస్‌లు దారితప్పుతున్నారని, ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తోందని సింగ్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. అయితే మంత్రి తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు సింగ్ ఆయనపై ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి వ్యాజ్యాలను తోసిపుచ్చాలని న్యాయస్థానానికి విజ్ఞప్తిచేశారు. ముంబయి పోలీస్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేసిన తర్వాత పరమ్ బీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు, ఇతర సీనియర్ నాయకులకు అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి చర్యలపై ఫిర్యాదుచేశారు. ఆ తర్వాత ఆయన మొదట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దాంతో హైకోర్టును ఆశ్రయించారు.