జార్ఖండ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు
మహారాష్ట్రలో నవంబర్ 20న,
జార్ఖండ్‌లో 13, 20 తేదీల్లో పోలింగ్
23న రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
48 ఎమ్మెల్యే, 2 ఎంపి స్థానాలకూ ఉప ఎన్నికలు
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల హర్యానా, జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు ముగియగా, తాజాగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే దశలో, జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20 (బుధవారం)న పోలింగ్ జరగనుండగా, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపట్టనున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఈనెల 22న నోటిఫికేషన్ జారీ అవుతుందని, నామినేషన్ల స్వీకరణకు 29 తుది గడువు కాగా, 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు తుది గడువు నవంబరు 4న అని చెప్పారు. ‘మహారాష్ట్రలో 36 జిల్లాల్లో మొత్తం 288 నియోజకవర్గాలు ఉండగా, వాటిలో 234 జనరల్ సీట్లు, 25 ఎస్టీ, 29 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. 2024 అక్టోబర్ 15 నాటికి మొత్తంగా 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే, 1.85 కోట్ల మంది 20-29 ఏళ్ల లోపు వారు కాగా.. 20.93లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అని కమిషనర్ తెలిపారు. అదే విధంగా జార్ఖండ్‌లో 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో జనరల్ 44 సీట్లు కాగా, ఎస్టీ 28, ఎస్సీ 9 చొప్పున ఉన్నాయి. మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు.. 1.31 కోట్ల మంది పురుషులు, 66.84లక్షల మంది యువ ఓటర్లు కాగా.. 11.84 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. జార్ఖండలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, తొలివిడతకు ఈనెల 18న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు 25వ తేదీ కాగా, 28న పరిశీలన, 30న ఉపసంహరణకు తుది గడువు. నవంబరు 13న పోలింగ్ జరగనుంది. రెండవ విడత ఎన్నికలకు ఈనెల 22వ తేదీన నోటీఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు 22 కాగా, 30న పరిశీలన, నవంబరు 1వ తేదీన ఉపసంహరణకు తుది గడువు. 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక మొత్తం 288 మంది శాసన సభ్యులు ఉన్న మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీకి ఈ ఏడాది నవంబరు 26తో గడువు ముగియనుంది. అలాగే, 81 స్థానాలున్న జార్ఖండ్ శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ముగియనుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బిజెపి, శివసేన, ఎన్‌సిపి పార్టీలతో ఏర్పాటైన ‘మహాయుతి’ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. జార్ఖండ్‌లో జఎంఎం పక్షాలతో కూడిన ప్రభుత్వం కొనసాగుతోంది.
రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
అలాగే, దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వేర్వేరు రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న, నాందేడ్ లోక్‌సభ సీటుతో పాటు ఉత్తరాఖండ్‌లోని ఒక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.