బేగంబజార్‌లో 1200 గజాల హౌసింగ్ బోర్డు స్థలం స్వాహా
నిర్మాణంలో వాణిజ్య భవనం
వేర్వేరు అనుమతులు తీసుకొని ఒకే భవనంగా నిర్మాణం
ప్రభుత్వ భూమి అని తేల్చిన నాంపల్లి తహసీల్దార్
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
ప్రజాపక్షం/హైదరాబాద్
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ప్రభు త్వ భూమి కబ్జాలకు గురవుతున్నా పట్టించుకున్న వారే లేకుండా పోతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఎంతటి వారైనా సహించబోమని మున్సిపల్ శాఖమంత్రి కె.తారక రామారావు పలు మార్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే ఫిర్యాదు చేయాలని ఇటీవల జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్లో ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేశారు. బేగంబజార్‌లో 1200 చదరపు గజా ల స్థలంలో బహుళ అంతస్తుల వాణిజ్య భవ నం నిర్మాణం జరుగుతున్నా ప్రభుత్వ యం త్రాంగం ఎందుకు స్పందించడం లేదనే విషయంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపన పోలేదు. సాక్షాత్తు సంబంధిత తహసీల్దార్ ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినా కబ్జాదారులపై పోలీసులు ఇప్పటి వరకు చర్యలకు ఉపక్రమించలేకపోయారు. ప్రభుత్వ భూమి అని తహసీల్దార్ స్పష్టం చేసి, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసి నా పోలీసులు ఎందుకు మిన్నుకుండి పోయారనే విషయంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చకచక అనుమతులు…
నగరం నడిబొడ్డున ఉన్న బేగంబజార్‌లో కంచె చేను మెసిన చదంగా ప్రభుత్వ భూమికి జిహెచ్ఎంసి నిర్మాణ అనుమతులు మంజూ రు చేయడమే కాకుండా ఆస్తి బదలాయింపు (మెటేషన్) సైతం చేసింది. ఇక వాటర్బోర్డ్ అధికారులు తాగునీటిని, డ్రైనేజీ కనెక్షన్ మం జూరు చేశారు. విద్యుత్ అధికారులు అయితే ఏకంగా ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయడంతో పాటు దానిని ఏర్పాటు చేశారు. ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన వివిధ శాఖల అధికారులే వాటికి చకచక అనుమతులు మంజూరు చేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని శాఖల అధికారులు అనుమతలు మంజూరు చేయడంతో కబ్జాదారులకు మరింత బలం చేకూర్చినట్లుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బేగంబజార్‌లోని ఇంటి నెంబర్ 14-3-251/1,2లో హౌసింగ్ బోర్డుకు చెందిన సుమారు 1200 గజాల స్థలాన్ని కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుపుతున్నారు. ఈ విషయం తెల్సిన నాంపల్లి తహసీల్దార్ నిర్మల ఈ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన భూమి ప్రభుత్వానిదని కబ్జాదారులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా అక్కడ నిర్మిస్తున్న భవనానికి ప్రభుత్వ భూమి అని సూచిస్తూ నోటీసులు అంటిచడంతో పాటు బోర్డును ఏర్పాటు చేశారు. ఎ1/13252/2019 లేఖ ద్వారా ఆ భూమి జి-అబాది, ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు సదరు కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులు ప్రభుత్వ భూమితో పాటు దానికి అనుకొని ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి, మల్లయ్య పాక్షి ఐదు దేవాలయ ప్రాంగణానికి చెందిన సుమారు 70 చదరపు గజాల స్థలాన్ని సైతం స్వాహా చేశారు. దేవాలయం కమిటీ ప్రతినిధులు తహసిల్దార్, జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసి తదితర ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు. అయినా ఒక్క ప్రభుత్వ అధికారి కూడా స్పందించడం లేదని వారు వాపోయారు. చారిత్రకమైన ఐదు దేవాలయాల ప్రాంగణంలో కబ్జాలకు పాల్పడటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి : ఆనంద్ గౌడ్
బేగంబజార్‌లోని హౌసింగ్‌బోర్డు స్థలాన్ని కబ్జా చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ గోషామహాల్ నాయకులు ఎం.ఆనంద్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశామని చెప్పారు. 1200 చదరపు గజాల స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి సర్కిల్-14 నుంచి నిర్మాణ అనుమతులు తీసుకున్నారని తెలిపారు.
అక్రమ మార్గంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వినయ్ కపూర్ అనుమతులు మంజూరు చేశారని ఆరోపించారు. 1200 చదరపు గజాల స్థలానికి సర్కిల్ అధికారులు ఏ విధంగా అనుమతులు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. స్థలాన్ని ఆరు భాగాలు చేసి, వేర్వేరు వ్యక్తుల పేరుతో అనుమతులు తీసుకొని, రెండు సెల్లార్లతో ఐదు అంతస్తులతో ఒకే భవనంగా నిర్మిస్తున్నారని అన్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తుంటే జిహెచ్ఎంసి అధికారులు కబ్జాదారులకు వంతపడుతున్నారని ఆరోపించారు. సాక్షత్తు తహసీల్దార్ నోటీసులు ఇచ్చి, బోర్డు పెట్టారని చెప్పారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు దేవాలయ భూమిని కాపాడాలని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసి, వాటర్‌బోర్డు, విద్యుత్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆనంద్ గౌడ్ చెప్పారు.
మహానగరం నడిబొడ్డులో కబ్జాల పర్వం
RELATED ARTICLES