రాహుల్‌తో చంద్రబాబు చర్చలు
న్యూఢిల్లీ : బిజెపియేతర పార్టీల అగ్రనేతలు బుధవారంనాడు ఢిల్లీలో సమావేశం కావాల్సివుండగా, వివిధ కారణాల వల్ల నాయకులంతా హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ భేటీని వాయిదా వేయాలని నిర్ణయించారు. అప్పటికే ఢిల్లీకి చేరుకున్న టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబునాయుడు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు చంద్రబాబు మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కోల్‌కతాలో ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ గురించీప్రస్తావించినట్లుగా తెలిసింది. ప్రాంతీయ పార్టీలు, ఇతర బిజెపియేతర రాజకీయ పార్టీ ల నేతలంతా అందుబాటులోకి వచ్చిన తర్వాతనే మహాకూటమి అగ్రనేతల సమావేశాన్ని నిర్వహించాలని వారిద్దరూ భావించినట్లు తెలిసింది. ఈ మేరకు నాయకులందరికీ సమాచారం అందజేసినట్లుగా భావిస్తున్నారు.