ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
అభ్యంతరాలు ఉపసంహరించుకున్న చైనా
న్యూయార్క్: జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి గురువారం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో భారత్‌కు దౌత్యపరంగా పెద్ద విజయం దక్కింది. అతడిని ఐరాస బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్‌దే పైచేయి అయిం ది. అజార్ విషయంలో చైనా పెట్టిన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చడానికి మార్గం సుగమం అయింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ పతాక స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు చైనా దిగొచ్చింది. మరోవైపు ఐరాస ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే పాకిస్థాన్ సైతం స్పందించింది. పైగా అతడికి గ్లోబల్ ఉగ్రవాది ట్యాగ్ ఇవ్వడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అతడిని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రకటించారు. సవరణలు చేసిన తీర్మానాన్ని అధ్యయనం చేశాక మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అభ్యంతరం చెప్పడానికి ఏమీ దొరకలేదని చైనా బుధవారం తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 1267 అల్ కైదా ఆంక్షల కమిటీ వివరంగా జాబితాను తయారుచేసిందని పేర్కొంది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అన్ని పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఐరాసలోని మూడు శాశ్వత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మద్దతుతో 2009లోనే ప్రతిపాదన చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని ముసాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. మార్చి 13 తర్వాత భారత్, అమెరికాల మధ్య, అమెరికా, చైనాల మధ్య ముమ్మర మంతనాలు జరిగాయి. ఈ విషయంలో ఇంకా చైనా వైఖరిని నమ్మలేమని భారత్ స్పష్టం చేసింది. దాంతో చివరికి చైనా దిగొచ్చింది. ‘మసూద్ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది’ అని అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో అజార్ ఆస్తులు, విదేశాల్లోని ఇతర ఆసిపాస్తులను జప్తు చేసేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. పైగా అతడి విదేశీ పర్యటనలపై నిషేధం, ఆయుధాలపై ఆంక్షలు ఉండనున్నాయి.15 సభ్యదేశాలున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇన్నాళ్లు అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకుంటూ వచ్చింది చైనాయే. ‘సాంకేతిక కారణాలు’ చూపుతూ, ‘పరిశీలనకు మరింత సమయం అవసరం’ అంటూ మరీ అడ్డుకుంది. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జవాన్ల వాహన శ్రేణిపై ఫిబ్రవరి 14న జరిగిన దాడిలో 41 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు తామే కారణమంటూ చెప్పడంతో ఈ జైషే మహమ్మద్ తెర మీదకు వచ్చింది. దీంతోపాటు ఆ సంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ మళ్లీ తాజాగా డిమాండ్ చేసింది.