నరాలు తెగే ఉత్కంఠ!
దేశ భవిష్యత్ తేలేది
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
న్యూఢిల్లీ/చెన్నై: 542 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. దాదాపు 8 వేలకు పైగా అభ్యర్థులు పోటీపడ్డారు. వారి భవిత్యం నేడు (గురువారం) తేలనుంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఉండగలదని సమాచారం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఇవిఎంలు) కౌంట్‌తో ఓటర్ ధ్రువీకరణ రశీదులు (వివిప్యాట్ స్లిప్పులు) సరిపోల్చుకోనుండడం అనేది ఇదే తొలిసారి. ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో 90.99 కోట్ల ఓటర్లలో 67.11 శాతం మంది తమ ఓటును వినియోగించుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధికంగా ఓటర్లు ఓటేయడం అనేది ఈసారే జరిగింది.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు పోలింగ్ స్టేషన్ల చొప్పున ఇవిఎంలతో వివిప్యాట్ రశీదులను సరిపోల్చే ప్రక్రియ కొనసాగనుంది. ఈ లెక్కన 20,600 పోలింగ్ బూత్‌ల ఓట్లను సరిపోల్చనున్నారు. కాగా మొత్తం 10.3 లక్షల పోలింగ్ స్టేషన్ల ఓట్లను లెక్కించబోతున్నారు. కౌంటింగ్ సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేయబోతున్నారనేది ఇంకా ఎన్నికల సంఘం తెలుపాల్సి ఉంది. దీనికి సంబంధించిన డేటా కేంద్రీయంగా అందుబాటులో లేదు. ఆనవాయితి ప్రకారం మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడంతో ఓట్ల లెక్కింపుకు శ్రీకా రం చుట్టనున్నారు. సర్వీస్ ఓటర్లు మొత్తంగా 18 లక్షల మంది ఉన్నారు. వారిలో తమ నియోజకవర్గం విధులు నిర్వహించిన సాయుధ బలగాలు,కేంద్ర పోలీసు బల గం, రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇక విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో ఉన్న దౌత్యవేత్తలు, వారికి సాయపడే సిబ్బందిని కూడా సర్వీసు ఓటర్లుగా లెక్కిస్తారు. మొత్తంగా నమోదైన 18 లక్షల సర్వీస్ ఓటర్లలో 16.49 మంది తమ నియోజకవర్గానికి చెందిన సంబంధిత రిటర్నింగ్ అధికారులకు మే 17న పోస్టల్ బ్యాలట్లు పంపారు. ఈ పోస్టల్ బ్యాలట్లను చేత్తో(మ్యానువల్లీ) లెక్కించనున్నారు. ఈ లెక్కింపుకు కనీసం కొన్ని గంటలు పట్టవచ్చునని ఎన్నికల సంఘం అధికారి చెప్పారు. ఇక వివిప్యాట్ మిషన్ల రశీదులను చివరన లెక్కించనున్నారు. నియమం ప్రకారం మొదట స్లిప్పులను లెక్కిస్తారు. తర్వాత ఇవిఎం డిస్‌ప్లేలను స్విచ్‌ఆన్ చేస్తారు. రెండింటి లెక్క సరిపోవల్సి ఉంటుంది. ఒకవేళ లెక్కలో తేడా వస్తే వివిప్యాట్ రశీదుల లెక్కనే తుది ఫలితంగా పరిగణిస్తారు. ఈ విధంగా ఇవిఎంలు, వివిప్యాట్ రశీదులను సరిపోల్చడం వల్ల నాలుగు నుంచి ఐదు గంటలు అదనంగా సమయం పడుతుంది. కనుక ఫలితా ల వెల్లడిలో ఆలస్యం జరగనున్నది.లోక్‌సభలో మొత్తం 543 స్థానాలున్నాయి. వాటిలో 542 నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహించారు.తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గం ఎన్నికలను ధన బలం దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంగా రద్దు చేశారు. అయితే వెల్లూరు నియోజకవర్గం ఎన్నికలకు తాజా తేదీని ఎన్నికల సం ఘం ప్రకటించాల్సి ఉంది.ఈసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, అనేక మంది కేం ద్ర మం త్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర కీలక ప్రముఖులు పోటీపడ్డారు.