మరణ మృదంగం
బీహార్, మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు
12 మంది దుర్మరణం
ప్రధాని మోడీ, బీహార్ సిఎం నితీష్‌కుమార్ సంతాపం
కతిహార్/ఇండోర్ : బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రా ల్లో మంగళవారంజరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో 12 మంది మరణించారు. బీహార్ కథియార్జిల్లా జాతీయ రహదారిపై వెళుతున్న ఒక కారు లారీని ఢీ కొట్టడంతో అందు లో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు దుర్మరణం పాలయ్యారు. సమస్తిపూర్ నుండి పూర్ణియాకు వెళుతున్న కారు కురిసెల పోలీస్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్-31పై ఈ ప్రమాదానికి గురైంది. లారీని అధిగమించే యత్నంలో డ్రైవింగ్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితిష్‌కుమార్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వారి బంధువులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ ఇండోర్జిల్లాలో ఇంథన ట్యాంకర్‌ను ఒక కారు ఢీకొన్న ఘటనలో మంగళవారనాడు ఆరుగురు మరణించారు. వేగంగా వెళుతున్న కారు తలవలి చంద్ర ప్రాంతంలోని ఒక పెట్రోలు బంకు వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవారంతా అక్కడికక్కడే మరణించారు. ఇండోర్ నివాసితులైన మృతులంతా 18-28 మధ్య వయస్కులే.