ఒకే రోజు స్పెయిన్‌లో 1000, అమెరికాలో 884 మరణాలు!
మ్యాడ్రిడ్: మహమ్మారి కరోనా వైరస్‌ను అదుపు చేయడం ఒకింత చాలా కష్టతరంగా మారింది. చైనా నుంచి అందిన వార్తలను బట్టి, అక్కడ సాధారణ పౌరజీవనం చూస్తుంటే కరోనా ఆ దేశంలో దాదాపుగా అదుపులో వున్నట్లు కన్పిస్తోంది. మిగిలిన దేశాలను మాత్రం ఈ రోగం వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 9లక్షల 61వేలకు చేరగా, మరణాల సంఖ్య 49,160కి చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో స్పెయిన్‌లో ఏకంగా 1000 మంది, అగ్రరాజ్యం అమెరికాలో 884 మంది మరణించడంతో పశ్చిమ దేశాల్లో భయోత్పాత వాతావరణం నెలకొన్నది. అన్ని వసతులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగివున్న అమెరికాలోనే దీన్ని నియంత్రించడం అక్కడి పాలనాయంత్రాంగానికి సాధ్యం కావడం లేదు. ఈ మహమ్మారితో అమెరికా అతలాకుతలం అవుతోందని స్వయంగా ట్రంప్ నోటనే మాటలు విన్పిస్తున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే దేశంలో అత్యధికంగా 884మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌తో మరణించిన వారిసంఖ్య 5,113కు చేరింది. 2,15,362 మంది ఈ వైరస్ బారినపడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న మరణాలు తీవ్రంగా కలచివేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ అమెరికన్లు ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. ఇదేపరిస్థితి మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని వైట్‌హౌజ్‌లో మీడియాతో అన్నారు. అయితే ఈ భయంకరమైన వైరస్‌పై పోరు కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. వైరస్ తీవ్రత తగ్గించడానికి లాక్డౌన్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ అమెరికాలో మరణాల సంఖ్య భారీగానే ఉండొచ్చని కరోనావైరస్పై శ్వేతసౌధం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అంచనా వేసింది. దీన్ని ఇప్పటికిప్పుడు తగ్గించేందుకు తమవద్ద ఎటువంటి మందూ లేదని తెలిపింది. దీనికి ఏకైక నివారణ వ్యాక్సిన్ అని స్పష్టంచేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీ ప్రాథమిక దశలోనే ఉందని పేర్కొంది. దీనికోసం మరో ఏడాది ఆగాల్సిందేనని శ్వేతసౌధం అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంతటి భయానక పరిస్థితి ఉన్న అమెరికాలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరాకరించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటున్నాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 30కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముందస్తు ఆంక్షలు ఏప్రిల్ 30వరకు కొనసాగుతాయని తెలిపారు. మరో 30రోజులపాటు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా వైరస్ తీవ్రత తగ్గించవచ్చని అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. మరోవైపు, కరోనా కేసులు సంఖ్య పది లక్షలకు సమీపిస్తుండగా, అందులో సగం కేసులు అంటే 5 లక్షల కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయని ఎఎఫ్‌పి వార్తా సంస్థ అధికార వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. గడిచిన ఐదు వారాల కన్నా ఈ ఒక్క వారంలోనే మరణాల సంఖ్య రెట్టింపు అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ అధానోమ్ గెబ్రియేసిస్ వెల్లడించారు. కొద్ది రోజుల్లో కరోనా కేసుల సంఖ్య ఒక మిలియన్‌కు, మరణాల సంఖ్య 50,000కు చేరువ కాబోతున్నదని, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు అప్రమత్తంగా వుండాలని బుధవారం రాత్రి జరిగిన ఒక వర్చువల్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో డబ్ల్యుహెచ్ఓ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఒక్క ఐరోపాలోనే 35,000 మంది ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో ప్రతిరోజూ అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. స్పెయిన్‌లో ఒక్కరోజులోనే వెయ్యి మరణాలు సంభవించడం రికార్డు. కరోనా సోకిన తర్వాత ఈ తరహాలో 24 గంటల మరణాలు ఏ ఇతర దేశంలోనూ సంభవించలేదు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 10,000 దాటింది. కేసుల సంఖ్య 1,10,238కి చేరింది. యూరోజోన్‌లో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన స్పెయిన్‌లో ఇప్పటివరకు 3,02,265 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో 16 ఏళ్లు, బెల్జియంలో 12 ఏళ్లు, బ్రిటన్‌లో 13 ఏళ్ల వయసు గల యువకులు ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇంకా ఐసోలేషన్‌లోనే వున్నారు. ఇటలీలో కరోనా కేసుల సంఖ్య 1,10,57కు చేరగా, మరణాల సంఖ్య అనూహ్యమైన రీతిలో 13,155కి చేరింది. చైనాలో కొత్త కేసులు కేవలం 35 మాత్రమే నమోదయ్యాయి. జర్మనీలో ఒకే రోజు 3 వేల కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య 962కి చేరింది. జర్మనీలో కేసులు నమోదవుతున్నా, మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా వుంది. ఇప్పటివరకు ఆ దేశంలో 56,468 కేసులు నమోదుకాగా, 4,032 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్లో 3,160 మంది, బ్రిటన్‌లో 2,961 మంది మరణించారు.
మరణమృదంగం!
RELATED ARTICLES