మధ్యాహ్న భోజనంలో ఇక తాజా కూరలు

గురుకులాల్లోనూ కూరగాయల ఖర్చుకు చెక్‌
పౌష్టికాహారంతో పాటు తోటల పెంపకంపైన అవగాహన

ప్రజాపక్షం/హైదరాబాద్‌: మధ్య తరగతి వారే వారానికి రెండు సార్లు కూరగాయలతో భోజనం చేయాలంటే హడలిపోతున్న రోజులివి. కూరగాయలు తక్కువ ధరకు ఉన్నప్పుడే పాఠశాలలో పప్పు, సాంబార్‌లలో ఏదో ఒకదానితో మధ్యాహ్న భోజనం కానిచ్చేవారు. కాని ఇకముందు ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు మందులతో పండించిన కూరగాయలు కాకుండా సేంద్రియ పద్దతిలో పండించిన ఆరోగ్యకరమైన తాజా కూరగాయలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించి పాఠశాలలు, గురుకులాలకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన మైదానాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. హైదరాబాద్‌లాంటి మహానగరంలోనూ చాలామేర ప్రభుత్వ పాఠశాలల్లో మైదానాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇలాంటి గురుకులాలలకైతే చెప్పనక్కర్లేదు. దాదాపు అన్నింటిలోనూ కావాల్సినంత స్థలం ఉంది. ఈ స్థలాల్లో ఆయా పాఠశాలల్లోని, గురుకులాల్లోని విద్యార్థుల భోజన అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, వీలున్న చోట పండ్ల తోటలను కూడా పెంచాలని సర్కార్‌ నిర్ణయించింది. భోజన అవసరాలకు పప్పులు ఇతరత్రా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇక కూరగాయల తోటలు పెంచినట్లయితే ఏ రోజుకారోజు, ఏ పూటకాపూట అప్పటికప్పుడు చెట్ల నుంచి కోసుకుని తాజాతాజాగా వండి విద్యార్థులకు పెట్టవచ్చు. దీనిని ప్రతి పాఠశాల, గురుకులం తప్పనిసరిగా అమలు చేయాలని సర్కార్‌ గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను విద్యాశాఖ, ఆయా గురుకులాల సంక్షేమ శాఖలతో పాటు యువజన సర్వీసుల శాఖకు అప్పగించింది. ఖర్చు కారణంగా కల్తీ, నాసిరకం కూరగాయలు వండి వార్చుతుండడంతో విద్యార్థుల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం ప్రతి విద్యార్థి భోజన ఖర్చుకు నిర్దేశించిన వ్యయంలో పప్పుతో పెట్టడమే భారమవుతున్న తరుణంలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలో కూరలు వండి పెట్టే పరిస్థితులు లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కూరగాయలకు అయ్యే ఖర్చు తగ్గడంతో పాటు తాజా, ఆరోగ్యకరమైన కూరలలతో విద్యార్థులకు భోజనం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యువజన సర్వీసుల శాఖ సైతం పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి తగు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాకలెక్లర్లకు లేఖలు రాసింది. ఖాళీ స్థలాలు లేక భవనాలు ఉన్న పాఠశాలల్లో టెర్రస్‌పై కూరగాయల పెంపకం చేపట్టాలని ఈ లేఖలో స్పష్టం చేసింది. అంతే కాదు ఈ తోటల పెంపకంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వార్డెన్లు, సంబంధిత ఇతర అధికారులతో ఈ కూరగాయలు, పండ్ల తోటల పెంపకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజువారి అవసరాలకు ఉపయోగించే కూరగాయలతో పాటు విద్యార్థులకు అప్పడప్పుడు పండ్లు కూడా ఇచ్చేందుకు పండ్ల తోటలను కూడా పెంచనున్నారు. పాఠశాలలు, గురుకులాల్లో ఏ చిన్న ఖాళీ స్థలం ఉన్నా అక్కడ వీటిని పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?