కృష్ణా జల వివాదం విచారణ నుంచి తప్పుకొన్న ప్రధాన న్యాయమూర్తి
న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు సూచించిన మధ్యవర్తిత్వ మార్గానికి ఆంధ్రప్రదేశ్ ససేమిరా అనడంతో ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ వ్యాజ్యం విచారణ ధర్మాసనం నుంచి స్వయంగా తప్పుకొన్నారు. ఇలా ఉంటే సాగునీరు, తాగునీరు విషయంలో తెలంగాణ తనకు వచ్చే న్యాయమైన వాటాను అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలుచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాజ్యంపై సోమవారం జరిగిన విచారణలో తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాణ్నని, వివాద పరిష్కారం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వ మార్గాన్ని అనుసరించాలని ప్రధాన న్యాయమూర్తి రమణ సూచించారు. తాము ఈ వివాదంలో ‘అనవసరంగా’ జోక్యం చేసుకోలేమని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో మధ్యవర్తిత్వానికంటే న్యాయపరంగానే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది జి. ఉమాపతి వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘ఈ అంశాన్ని వేరొక ధర్మాసనానికి బదిలీ చేస్తున్నాం. మధ్యవర్తిత్వం అవసరం లేకపోతే, మేము మీపై ఒత్తిడి చేయం. దీనిని వేరే ధర్మాసనం ముందు ఉంచండి’ అని ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ స్పష్టంచేశారు. మధ్యవర్తిత్వం అవసరం లేకపోతే, తాను ఈ అంశాన్ని వినదలుచుకోలేదని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద ఏర్పాటుచేసిన సర్వోన్నత మండలి నిర్ణయాలను, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు (కెఎంఆర్బి), కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులైలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి జలాశయాలతోపాటు పులిచింతల జలాశయాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని ఈ వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసింది. ఒకవేళ అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ జలాశయాలను పోలీస్ పహరాలో న్విహించాలని ఈ వ్యాజ్యంలో పేర్కొన్నారు.