మధ్యవర్తిత్వమే మంచిది

కోర్టు గుమ్మం తొక్కే ముందే ఆలోచించుకోవాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే
పాట్నా : కోర్టు గుమ్మం ఎక్కేముందుగానే మధ్యవర్తి పరిష్కారం ఉండాలని తద్వారా న్యాయస్థానాలపై ఆధారపడడాన్ని తగ్గించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే ప్రతిపాదించారు. సివిల్‌-క్రిమినల్‌ కేసుల్లో సమస్యలు వచ్చినప్పుడు వెంటనే కోర్టుగుమ్మం ఎక్కకుండా వ్యా జ్యాలకు వెళ్ళేముందు మధ్యవర్తి పరిష్కారాల్ని ప్రోత్సహించాలని అన్నారు. పాట్నా హైకోర్టు శతవార్షికోత్సవాల సందర్భంగా నూతన భవనానికి శనివారంనాడు బోబ్డే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కరోల్‌ తదితర ప్రముఖులు హాజరైన సభలో వారి సమక్షంలోనే బోబ్డే పై ప్రతిపాదన చేశారు. కోర్టుకెక్కకముందే కేసులు పరిష్కారమైనప్పుడు వివాదంలో చిక్కుకున్న ఇరు వర్గాల వారికీ కోర్టుమీద ఆధారపడకుండా దొరికే పరిష్కారంవల్ల లభించే సంతృప్తి, ఆ మనోభావనలు చాలా భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. వ్యాజ్యాలకు ముందే పరిష్కారాలు జరగాలంటే, ఆ మధ్యవర్తిత్వంలో న్యాయశక్తి ఒక్కటే కొరవడుతోందన్న, విషయాన్ని న్యాయశాఖామంత్రితో చర్చించానని, దీన్ని గనుక సాధించగలిగితే సరిపోతుందని అన్నారు. ఎలాంటి వ్యాజ్యాలూ ప్రోత్సహించనిరీతిలో అందరికీ చట్టపరమైన అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉందని బోబ్దే అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?