HomeNewsBreaking Newsమతం పేరుతో… ప్రజలమధ్య విభజన రేఖ

మతం పేరుతో… ప్రజలమధ్య విభజన రేఖ

ఎన్‌ఇపికి వ్యతిరేకంగా పోరాడుదాం: ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి దినేష్‌ శ్రీరంగరాజన్‌
సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యారంగం : శువం బెనర్జీ
ప్రజాపక్షం/ఖమ్మం

మతం పేరుతో ప్రజల మధ్య విభజన రేఖను తీసుకొచ్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే శ్రీరామ జపం చేస్తున్నారని ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి దినేష్‌ శ్రీరంగరాజన్‌ అన్నారు. ఇదే సమయంలో విద్యను కేంద్రీకరించి నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు పూనుకుందని, ఆ క్రమంలోనే నూతన జాతీయ విద్యా విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర తృతీయ మహాసభలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్‌లో ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభానికి ముం దుకు ఎఐఎస్‌ఎఫ్‌ పతాకాన్ని శువం బెనర్జీ ఆవిష్కరించారు. మహాసభలో తొలుత మృత వీరులకు నివాళులర్పించారు. అశోక్‌ స్టాలిన్‌, పుట్టా లక్ష్మణ్‌, ఇటుకల రామకృష్ణ, ఉప్పుశెట్టి రాహుల్‌, అంజలి అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ప్రతినిధుల మహాసభలో దినేష్‌ శ్రీ రంగరాజన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. 1936 నుండి ఇప్పటి వరకు 87 సంవత్సరాల సుదీర్ఘ పోరాటచరిత్ర కలిగిన ఎఐఎస్‌ఎఫ్‌ భవిష్యత్‌లో విద్యలో మతాన్ని చొంపించడాన్ని వ్యతిరేకిస్తూ బహుముఖ పోరాటాలకు సిద్ధం కానుంద్నారు. ఇందు కోసం యువతను చైతన్య పరచాలని, విద్యార్థులను పోరాటాలకు కార్యోన్ముఖులను చేయాలన్నారు. కశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలో చూసినా విద్యార్థి ఉద్యమ బీజాలు ఎఐఎస్‌ఎఫ్‌దే అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ విషయం ఆర్థిక విషయాలతో ముడిపడి పోయిందని, జేబుల్లో డబ్బుల్లేకుండా క్షణం గడిచే పరిస్థితి లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోడీ సర్కార్‌ ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. సోషల్‌ మీడియాను స్వాగతించాల్సిందే గానీ, కొందరు సోషల్‌ మీడియా ద్వారా విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం చైతన్యవంతమైందని, ఎఐఎస్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ బాటలో ముందుందని తెలిపారు. చదువుకై పోరా డు, చదువుతూ పోరాడు అనే నినాదంతో కొత్త సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యార్థి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.
సంక్షిష్ట స్థితిలో విద్యావ్యవస్థ : శువం బెనర్జీ
భారతదేశ విద్యావ్యవస్థ సంక్షిష్ట పరిస్థితుల్లో ఉందని, కేంద్రలో విద్యార్థి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉందని ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు శువం జెనర్జీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ నూతన విద్యావిధానాన్ని తీసుకురావాలని బిజెపి ప్రయత్నిస్తోందని, ఈ విద్యా విధాన రూపకల్పన ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలో జరగడం అత్యంత బాధాకరమన్నారు. అన్నింటికీ మించి యూనిర్సిటీల్లో మతం, కులం పేరిట విభజన జరుగుతోందని, ఈ క్రమంలోనే రోహిత్‌ వేముల వంటి వ్యక్తులు హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1971లో కేంద్రంలో ఉన్న విద్యా విధానాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్రాలకు దాఖలు పరిచింది కానీ.. మోడీ ప్రభుత్వం తిరిగి విద్యా విధానాన్ని కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతులకు, విద్యారంగానికి, సామాన్యులకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించేందుకు బిజేపి ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వైస్‌ ఛాన్సలర్ల విషయంలోనూ కుల,మత వివక్షను పాటిస్తుందన్నారు. 49 సెంట్రల్‌ యూనివర్సిటీలకు గాను ఎస్‌టి – 1, ఎస్‌సి – 1, బిసి – 6 మందిని మాత్రమే వైస్‌ ఛాన్సలర్లుగా నియమించారన్నారు. చదువు కోసమే కాకుండా విద్య అనంతరం ఉద్యోగం కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఎఐఎస్‌ఎఫ్‌ నేతృత్వంలో మతానికి, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రజాసంఘాల సౌహార్థ సందేశాలు
రాష్ట్ర మూడవ మహాసభలో సోదర విద్యార్థి సంఘాలతో పాటు కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల నేతలు సౌహార్థ సందేశాలు అందించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, ఎఐడిఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలీఉల్లా ఖాద్రీ, ధర్మేంద్ర, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కిళ్లపల్లి శ్రీనివాసరావు, బాలమల్లేష్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పోటు ప్రసాద్‌, ఎస్‌కె సాబీర్‌ పాషా, విజయసారధి, నాయకులు శింగు నర్సింహారావు, బిజి క్లెమెంట్‌, మర్రి వెంకట స్వామి, కొయ్యాడ సృజన్‌ కుమార్‌ తదితరులు ప్రసగించారు. ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రావి శివరామకృష్ణ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఈ మహాసభల్లో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఆర్‌ఎన్‌ శంకర్‌, మహేందర్‌, రాము తదితరులు పాల్గొనగా మాజీ ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులకు మహాసభ పక్షాన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments