HomeNewsLatest Newsమణిపూర్‌లో ఉగ్రదాడి

మణిపూర్‌లో ఉగ్రదాడి

సైనికుల కాన్వాయ్‌ పేల్చివేత
కల్నల్‌ కుటుంబం సహా ఏడుగురు మృతి
ప్రధానమంత్రి ఖండన
ఇంఫాల్‌ : మణిపూర్‌లో వేర్పాటువాద ఉగ్రవాదులు శనివారం తాజాగా కొండల్లో మాటు వేసి దారుణ హింసకు పాల్పడ్డారు. వారి దాడిలో కల్నల్‌, ఆయన కుటుంబం, మరో నలుగురు సైనికులు సహా మొత్తం ఏడుగురు మరణించారు. అసోం రైఫిల్స్‌కు చెందిన కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడుతో సహా మరో నలుగురు సైనికులు ప్రయాణిస్తున్న వాహనాలను శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో పేల్చివేశారు. సరిహద్దు రాష్ట్రంలో శనివారం ఉదయం ఈ ఘోరం జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే ఈ దాడిలో మరొక సైనికుడు కూడా మరణించినట్లు సమాచారం. దీంతో ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్లవుతుంది. 12, 13 తేదీలలో వేర్పాటువాద పీపుల్స్‌ రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ కాంగ్లీపాక్‌ (పిఆర్‌ఇపిఎకె) స్మారక దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మణిపూర్‌ ఛురాచాంద్‌పూర్‌ జిల్లాలోని సెహ్ఖాన్‌ గ్రామంలో పొంచి ఉన్న వేర్పాటువాద ఉగ్రవాదులు కల్నల్‌ త్రిపాఠి కార్ల బృందంపై దాడికి పాల్పడ్డారు. దాడి కి పాల్పడిన వారు పీపుల్స్‌ రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ కాంగ్లీపాక్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఐఇడి (ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డెవైజెస్‌) పేలుడు పదార్థాన్ని ఉపయోగించి కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. జన సంచారం లేని కొండల మధ్య ఉండే అతి సన్నని దారిలో ఆర్మీ కాన్వాయ్‌ వెళుతుండగా వారు ఈ దాడికి పాల్పడ్డారు. అంతకుముందు అసోం రైఫిల్స్‌ సిబ్బంది ఉగ్రవాదులతో కాల్పల దాడిలో పాల్గొన్నారు. ఈ కాల్పు ల యుద్ధం తర్వాత కొనసాగింపుగా ఈ సంఘటన జరిగింది. పిఆర్‌ఇపిఎకె/పిఎల్‌ఎ కు చెందనవారుగా భావిస్తున్న ఉగ్రవాదులతో కాల్పుల యుద్ధం జరిగింది. కమాండింగ్‌ ఆఫీసర్‌, ఆయనతోపాటు ముగ్గురు సత్వర ప్రతిస్పందనా బృందం సిబ్బంది, కమాండింగ్‌ ఆఫీసర్‌ సతీమణి, వారి ఆరేళ్ళ కుమారుడు ఈ దాడిలో అక్కడిక్కడమే మరణించారు. గాయపడిన మిగిలినవారిని బెహియాంగా ఆరోగ్య సంరక్షణా కేంద్రంలో చేర్చినట్లు అసోం రైఫిల్స్‌ ఒక ప్రతికా ప్రకటనలో తెలిపింది.
పిరికిపందల చర్య
వేర్పాటువాద ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివర్ణించారు. మరణించిన సైనికుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని ఒక ప్రకటనలో మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనలో సిబ్బందిలో మరొకరు కూడా మరణించారని సూచించారు. అసోం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై చేసిన దాడిని పిరికిపందల చర్యగా రక్షణమంత్రి అభివర్ణించారు. ఈ ఘటన ఎంతో ఆవేదన కలిగించేదని సర్వత్రా ఖండించ దగిన విషయమని అన్నారు. ఒక కల్నల్‌ (46 ఎఆర్‌) తో సహా భారతదేశం ఐదుగురు గొప్ప వీరోచిత సైనికులను కోల్పోయిందని,కల్నల్‌ సతీమణి, చిన్నారి కుమారుడు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారని రక్షణమంత్రి ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మరొకరు మరణించినట్లు రక్షణమంత్రి సూచనాప్రాయంగా చెప్పనప్పటికీ ఈ మృతిని వెంటనే ఎవరూ ధృవీకరించలేదు.
విప్లవ త్రిపాఠి వీరోచిత సేవలు
అసోం రైఫిల్స్‌ దేశంలోనే అతి పురాతనమైన పాక్షిక సైనికబలగం. 1830లో బ్రిటీష్‌ వలస పాలకుల పరిపాలనాకాలంలో అసోం రైఫిల్స్‌ ఆవిర్భవించింది. కేంద్ర మంత్రిత్వశాఖ పరిపాలనా పరిధిలో అసోం రైఫిల్స్‌ పని చేస్తుంది. కానీ దీని కార్యాచరణ కార్యక్రమాల బాధ్యతలన్నీ భారత సైన్యం అధీనంలోనే ఉంటాయి. దాడిలో మరణించిన కల్నల్‌ విప్లవ త్రిపాఠి ఈ ఏడాది జులైలో మణిపూర్‌కు బదిలీపై వచ్చే వరకు మిజోరాలో పనిచేశారని అసోం రైఫిల్స్‌ తన స్మృతి నివాళి ప్రకటనలో పేర్కొంది. మిజోరాంలో ఆయన పనిచేసిన కాలంలో ఆయన నాయకత్వంలో బెటాలియన్‌ సరిహద్దు కార్యకలాపాల నిర్వహణలో ముందుపీఠిన నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనసరిహద్దుల్లో అక్రమ రవాణా కార్యకలాపాలను కట్టడి చేశారని పేర్కొన్నారు. తమ బెటాలియన్‌ ఆయన నాయకత్వంలో ఎన్నో అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకుందని కూడా గుర్తు చేసుకున్నారు. పెద్ద పెద్ద దాడులను నివారించేవిధంగా ఆయన ఎన్నో జాతి వ్యతిరేక శక్తులను మట్టుపెట్టారని నివాళులు అర్పించింది. ఎన్నో గొప్ప సాహసకృత్యాలు చేసిన విప్లవ త్రిపాఠి మిజోరాలో ఉన్నప్పుడు స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. 2021 జనవరిలో ఆయన నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమం అందరి మననలనూ పొందింది. రాష్ట్రలోని సుదూర గ్రామాల్లో కూడా ఆయనకుగుర్తింపు ఉంది. యువకులకు ఆయన మార్గదర్శకంగా ఉండేవారని, వారిని సన్మార్గంలో నడిపించేవారిన అసోం రైఫిల్స్‌ నివాళులు అర్పించింది.

సైనికుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు
సైనికులకకు ప్రధాని నివాళి ః ఉగ్రదాడికి ఖండన
న్యూఢిల్లీ ః మణిపూర్‌లో వేర్పాటువాద పిఆర్‌ఇపిఎకె అనుమానిత ఉగ్రవాదులు అసోం రైఫిల్స్‌ సైనికుల కాన్వాయ్‌పై పాల్పడిన హింసాత్మక దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరోచిత సైనికుల ప్రాణత్యాన్ని దేశం ఎన్నటికీ మరువదని ఒక ప్రకటనలో మోడీ పేర్కొన్నారు. వేర్పాటువాద ఉగ్రవాదుల దాడిలో ఒక కమాండింగ్‌ ఆఫీసర్‌ విప్లవ త్రిపాఠితో సహా ఐదుగురు సైనికులు మరణించారు. వీరంతా 46 అసోం రైఫిల్స్‌కు చెందినవారు. మరణించినవారిలో కమాండింగ్‌ ఆఫీసర్‌ సతీమణి, ఆయన ఆరేళ్ళ కుమారుడు కూడా ఉన్నారు.శనివారం ఉదయం మణిపూర్‌ ఛురాఛాంద్‌పూర్‌ జిల్లాలో కొండలమధ్య ఇరుకు దారిలో వెళుతుండగా ఐఇడి పేలుడుతో వారని హత్య చేశారు. మోడీ ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిసున్నాం, వారికి నా నివాళులు. వారి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరచిపోదు. వారి కుటుంబ సభ్యులకు ఈ సమయంలో ధైర్యం చేకూరాలి, ఈ విషాద సమయంలో వారి గురించే ఆలోచిస్తున్నాం అని ఆయన ట్వీట్‌ చేశారు.ఉగ్రదాడి మోడీ అసమర్థతకు చిహ్నం
రాహుల్‌గాంధీ ట్వీట్‌
న్యూఢిల్లీ ః మణిపూర్‌లో అసోం రైఫిల్స్‌పై వేర్పాటువాద ఉగ్రవాదులు జరిపిన హింసాత్మక దాడి మోడీ ప్రభుత్వ అసమర్థతకు చిహ్నమని కాంగ్రెస్‌పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ విమర్శించారు. ఆయన హిందీలో ఒక ట్వీట్‌ చేస్తూ, మోడీ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించారు. ఈ సంఘటన మరోసారి దేశాన్ని రక్షించడంలో మోడీ అసమర్థతను రుజువు చేసిందని విమర్శించారు. ఈ వేర్పాటువాద ఉగ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్‌ స్థాయి కమాండర్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యులు, మరో నలుగురు సైనికులకు రాహుల్‌గాంధీ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేశారు. దేశం మీ త్యాగాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుందని రాహుల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి,కాంగ్రెస్‌ నాయకుడు అశోక్‌ గెహ్లోత్‌, కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌ కూడా బాధిత కుటుంబాలకు తమ సంతాప సందేశాలు పంపించారు. ఉగ్రవాదుల పిరికిపంద చర్యలను వారు తీవ్రంగా ఖండించారు. గెహ్లోత్‌ ట్విట్టర్‌లో పోస్టింగ్‌ చేశారు. దాడికి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments