అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది
తక్షణం మావద్దకు రండి : మణిపూర్ డిజిపికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయిందని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం తమ సమక్షానికి హాజరై వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలో గల ధర్మాసనం మణిపూర్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను మంగళవారం ఆదేశించింది. మణిపూర్‌లో బాధితులపై కేసులు నమోదు చేయడమే తీవ్ర జాప్యం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మొద్దు సోమరితనంతోపాటు కేసుల దర్యాప్తు కూడా తీవ్ర మందకొడితనంగా సాగుతున్నాయని ధర్మాసనం విమర్శించింది. శాంతి భద్రతలను అమలుచేసే యంత్రాంగం అదుపులేకుండా సాగుతున్న జాతి హింసకు కళ్ళెం వేయలేకపోయిందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్ రాష్ట్ర పోలీసులు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను తమ అధీనంలో ఉంచుకోలేకపోయారని, పరిస్థితి వారి చేతులు దాటి మితిమీరినస్థాయికి చేరుకుందని ఆందోళన చెందింది. ఈ పరిస్థిల్లో రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరణ ఇచ్చేందుకు హుటాహుటిన ఆ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ తమ సమక్షంలో హాజరు కావాలని ఆదేశించింది. మే 4వ తేదీన మణిపూర్‌లోని బి.ఫాయినోమ్ గ్రామంలో మహిళల వివస్త్రలను చేసి ఊరేగించడం, తర్వాత సామూహిక అత్యాచారం చేసి ఒక యువతిని హత్య చేసిన ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమకు డిజిపి సమర్పించవలసి ఉంటుందని ముందుగానే ఆదేశించింది. మణిపూర్‌లో బాధితులు పోలీస్ స్టేషన్ పరిధులకు అతీతంగా ఎక్కడైనా కేసులు నమోదు చేసే ‘జీరో ఎఫ్ఐఆర్’లు అన్నీ తమకు పంపించాలని ఆదేశించింది. ఈ విధంగా మణిపూర్‌లో మొత్తం 6,000 కేసులు మే 3వ తేదీ నుండి నమోదయ్యాయని, ఈ కేసులన్నింటి వివరాలను, ఆ జాబితాలను తమకు సమర్పించాలని కూడా చంద్రచూడ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఏ మేరకు దర్యాప్తులు జరిగాయి, ఎంత మేరకు పురోగతి సాధించారు? ఏ మేరకు ఎంతమందిని అరెస్టులు చేశారు? వంటి వివరాలన్నీ తమకు తెలియజేయాలని కూడాఆయన ఆదేశించారు. “మణిపూర్‌లో చాలా దారుణమైన జాప్యం జరుగుతోంది, కేసుల విచారణ చతికిల పడింది, కేసుల నమోదు ప్రక్రియే
తీవ్ర ఆలస్యం చేశారు, బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేయలేదు, ఇప్పటికే చాలా సాక్ష్యాలు మాయం అయ్యాయి, శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది, పరిస్థితి చేయి దాటిపోయింది, రాజ్యాంగబద్ధమైన యంత్రాంగం విఫలమైంది” అని డి.వై.చంద్రచూడ్ లిఖితపూర్వకంగా లేని, నోటిమాటలుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ జె.బి.పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు.
మీరు ఎలాంటి దర్యాప్తు
చేపట్టకండి ః సిబిఐకి ఆదేశం
“ఒక్కటిమాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది, మణిపూర్‌లో బాధితులకు న్యాయం చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది, బాధితులు గోడు వెళ్ళబోసుకున్నాగానీ, వారి కేసులు నమోదు చేయకుండా అలసత్వం ప్రదర్శించారు అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దీనిపై కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, మహిళలను దిగంబరులను చేసి ఊరేగించిన వీడియో బయటకు వచ్చిన తరువాత, పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారని వివరణ ఇచ్చారు. దిగంబరలను చేసి ఊరేగించిన కేసులో సజీవంగా ఉన్న ఇద్దరుమహిళల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారని చెప్పారు. ఈ కేసులో ఒక బాలుణ్ణి కూడా పోలీసులు అరెస్టు చేశారనిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి దర్యాప్తు చేపట్టవద్దని సుప్రీంకోర్టు తొలుత సిబిఐకి ఆదేశించింది. దిగంబరులై తీవ్ర అవమానాలకు గురైన ఇద్దరు మహిళల తరపున న్యాయవాది నిజామ్ పాషా ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వారిద్దనీ తమ ఎదుట హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారణ ప్రారంభించింది. పెద్ద స్థాయిలో పోలీసులపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేయడంలో ఎందుకు 14 రోజులు జాప్యం చేశారని ప్రశ్నించారు. బాధితులైన ఇద్దరు మహిళలకు పోలీసులే రక్షణ ఇవ్వాల్సి ఉండగా, వారే మహిళలు ఇద్దరినీ అమానుష మూకల సమక్షానికి తీసుకువెళ్ళి అప్పగించడం ఏమిటంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు వారితో కుమ్మక్కు అయ్యారని, సిబిఐగానీ, పోలీసు దర్యాప్తు బృందాలు గానీ ఈ కేసులో విచారణ చేపట్టాలని తాము కోరుకోవడం లేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
మణిపూర్‌లో శాంతిభద్రతలేవీ?
RELATED ARTICLES