మోరేలో ఇళ్లు, బస్సులకు నిప్పు పెట్టిన దుండగులు
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారుల ప్రకటన
సహాయక శిబిరాల్లోని కుటుంబాల నివాసానికి తాత్కాలిక గృహాల నిర్మాణం
ట్విట్టర్‌లో మణిపూర్ సిఎం ఎన్.బీరెన్ సింగ్ ప్రకటన
ఇంఫాల్: మణిపూర్‌లోని మోరే జిల్లాలో బుధవారం కొంత మంది దుండగులు కనీసం 30 ఇళ్లు, దుకాణాలకు నిప్పు పెట్టడంతో పాటు భద్రతా దళాలతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోరే బజార్ ప్రాంతంలో ఈ పాడుబడిన ఇళ్లు ఉన్నాయి. దహనం తరువాత దుండగులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కూడా జరిగాయని అధికారులు తెలిపారు. సిబ్బందిని రవాణా చేయడానికి భద్రతా దళాలు ఉపయోగించే రెండు బస్సులను కాంగ్‌పోక్పి జిల్లాలో ఒక గుంపు తగులబెట్టిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం దిమాపూర్ నుంచి బస్సులు వస్తుండగా సపోర్మీనా వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికులు సపోర్మీనా వద్ద మణిపూర్ రిజిస్ట్రేషన్ నంబర్లతో కూడిన బస్సులను నిలిపివేసి మరో కమ్యూనిటీకి చెందినవారు ఎవరైనా ఉన్నారో లేదో తనిఖీ చేయాలని పట్టుబట్టారని, అనంతరం కొందరు బస్సులకు నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, ఇంఫాల్‌లోని సజివా, తౌబాల్ జిల్లాలోని యైతిబి లౌకోల్‌లో తాత్కాలిక గృహాల నిర్మాణం పూర్తవుతున్నట్లు ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్
తెలిపారు. ‘అతి త్వరలో సహాయక శిబిరాల్లోని కుటుంబాలు ఈ ఇళ్లలోకి మారగలుగుతారు. కొండలు, లోయలో ఇటీవలి హింసాకాండలో ప్రభావితమైన ప్రజలకు పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది’ అని సింగ్ ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు. జాతి కలహాల కారణంగా ఇళ్లు వదిలి పారిపోవాల్సిన ప్రజలకు తమ ప్రభుత్వం 3 నుంచి4 వేల వరకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను నిర్మిస్తుందని ముఖ్యమంత్రి గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో దాదాపు మూడు నెలల కింద జాతి హింస చెలరేగినప్పటి నుండి 160 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. షెడ్యూల్ తెగ (ఎస్‌టి) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ ప్రాంత జిల్లాల్లో ’గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత హింస చెలరేగింది. మణిపూర్ జనాభాలో మైతేయిలు దాదాపు 53 శాతం మంది ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. నాగాలు, కుకీలను కలిగి ఉన్న గిరిజనులు 40 శాతం మంది ప్రధానంగా కొండ ప్రాంత జిల్లాలలో నివసిస్తున్నారు.
మణిపూర్‌లో మళ్లీ హింస
RELATED ARTICLES