ప్రజాపక్షం / హైదరాబాద్‌ఊహించినట్టే టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌పై వేటు పడింది. ఆయనకు పార్టీ నుంచే ఉద్వాసన పలికే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ మరో అడుగు ముందుకేశారు. ఆయన సూచన మేరకు ఈటలను బర్తరఫ్ చేస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఈ ఆదేశం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై, తక్షణమే విచారణకు సిఎం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనితో ఆయన రాజీనామా చేస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. కానీ, రాజీనామా అంశాన్ని దాటవేస్తూ, విచారణలో నిజానిజాలు తేలుతాయని ఈటల ప్రకటించడంతో తదుపరి పర్యవసానలపై ఉత్కంఠ నెలకొంది. కాగా, భూకబ్జా ఆరోపణలపై సిఎస్ తక్షణమే స్పందిం చి, విచారణ జరిపించి, ఈటల కబ్జాలో అసైన్డ్ భూమి ఉందని ప్రాథమికంగా తేలినట్టు తెలిపారు. అదే సమయంలో ఈటల వద్ద ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి స్వయంగా తీసుకోవడం, ఈ మార్పుపై గవర్నర్ సంతకం చేయ డం అత్యంత వేగంగా జరిగిపోయాయి. శాఖలేని మంత్రిగా కొనసాగేందుకు ఈటల ఇష్టపడకపోవచ్చని, ఈ పరిణామంతో ఆయన రాజీనామా చేస్తారని బలమైన వాదన వినిపించింది. అయితే, అప్పుడు కూడా ఆయన రాజీనామా ప్రస్తావన తీసుకురాలేదు. తదుపరి చర్యగా ఈటలపై బర్తరఫ్ వేటు పడింది. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న సిఎం సిఫార్సుపై స్పందించిన గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు మంత్రిగా స్థానాన్ని కోల్పోయిన ఈటల ఎంఎల్‌ఎగా కొనసాగుతారా? రాజీనామా చేస్తా రా? మరో పార్టీలో చేరతారా? కొత్త పార్టీని ప్రకటిస్తారా? అనే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరికివారే ఊహాజనితమైన కథనాలతో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈటల ఏ క్షణంలోనైనా తన తుదపరి కార్యాచరణను ప్రకటిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇలావుంటే, భూకబ్జాపై అందిన నివేదిక ఆధారంగానే ఈటల బర్తరఫ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారని టిఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈటల కబ్జాలో 66 ఎకరాల అసైన్డ్ భూమి
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట గ్రామ శివార్లలో ప్రభుత్వం పేద బడుగు వర్గాలకు ఇచ్చిన సుమారు 66.01 ఎకరాల అసైన్డ్ భూములను జమున హాచరీస్ సంస్థ కబ్జా చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో విజిలెన్స్ శాఖ విచారణలో తేలింది. అసెన్డ్ భూముల గుండా రోడ్డు వేసారని, ఆ క్రమంలో ఫారెస్టు కన్సర్వేషన్ యాక్టు, వాల్టా చట్టానికి విరుద్దంగా చెట్లను నరికివేసారని మెదక్ జిల్లా అటవీ అధికారులు విచారణలో తేల్చారు. వ్యవసాయభూమిలో ‘నాలా’ చట్టానికి విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారని నివేదికలో పేర్కొన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట గ్రామ శివార్లలో 1994లో తమకు కేటాయించిన అసైన్డ్ భూములను తమ వద్ద నుంచి బలవంతంగా ఆక్రమించారని మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమునా హాచరీస్‌పై స్థానికులైన చాకలి లింగయ్యతో పాటు ఇతరులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అధికార వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు పట్టా భూములను నాటా చట్టానికి విరుద్దంగా వ్యవసాయాయేతర భూములుగా మార్చి వాటిలో భవనాలు, షెడ్లు నిర్మించారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి చట్టంలోని 4వ సెక్షన్ కింద తగిన చర్యలు తీసుకోవాలని నివేదికలో సూచించారు.
మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్
RELATED ARTICLES