HomeNewsBreaking Newsభూకబ్జాదారుల క్రౌర్యం

భూకబ్జాదారుల క్రౌర్యం

పేదలపై రాళ్లు, కర్రలు,
గొడ్డళ్లతో దాడుల
సిపిఐ నాయకులకు, గుడిసెవాసులకు గాయాలు
రణరంగమైన గుండ్ల సింగారం
క్షతగాత్రులు ఎంజిఎంకు తరలింపు
ప్రజాపక్షం/వరంగల్‌
హన్మకొండ రెవెన్యూ పరిధిలోని గుండ్ల సింగారంలో గుడిసెవాసులపై భూకబ్జాదారులు మరోసారి విరుచుకుపడ్డారు. గుండ్ల సింగారంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలపై సోమవారం దాడికి పాల్పడిన భూకబ్జాదారులు, స్థానికులు మంగళవారం మరోసారి దాడులకు తెగబడడంతో భయానక వాతావరణం ఏర్పడింది. గుడిసెవాసులకు సిపిఐ జిల్లా నాయకులు అండగా వెళ్లగా వారిపై కూడా కబ్జాదారులు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో దాడులు చేశారు. ఈ క్రమంలో గుడిసెవాసులకు, స్థానికులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణ జరుగుతున్నా పోలీసులు దాడులు చేస్తున్నవారిని నిలువరించకుండా ప్రేక్షకపాత్ర వహించారు. ఇటీవల ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇండ్లస్థలాలు కేటాయించాలని డిమాండు చేస్తూ హన్మకొండ జిల్లా కేంద్రం సమీపంలోని గుండ్ల సింగారంలోని ప్రభుత్వ భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది పేదలు గుడిసెలు
వేసుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో 60 గజాల కోసం వేసుకున్న పేదల గుడిసెలను భూ మాఫియా దారులు తొలగించడంతో గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గుండ్ల సింగారం ప్రాంతంలో సర్వే నెంబర్‌ 177లో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా సుమారు మూడు వేల మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. పేదలు గుడిసెలు వేసుకున్న భూమి తమదంటూ కొంతమంది అధికార పార్టీ నాయకుల అండతో అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో సోమవారమే భూకబ్జాదారులకు, గుడిసెలు వేసుకున్న పేదలకు మాటమాట పెరిగి స్థానిక కార్పోరేటర్‌ అనుచరులు కొందరు కర్రలు, రాళ్లతో పేదలపై దాడికి పాల్పడ్డారు. దీనిపై విచారించేందుకు సిపిఐ నాయకులు మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లగా వారిని భూమాఫియా మరోసారి అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణలో గాయాలపాలైన వారిని వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

గుడిసెవాసులతో పాటు వారిని పరామర్శించేందుకు వచ్చిన సిపిఐ నాయకులపై దాడికి పాల్పడిన భూకబ్జాదారులను కఠినంగా శిక్షంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. గుండ్ల సింగారం పేదలపై జరిగిన దాడి విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు వరంగల్‌ ఎంజిఎంలో చికిత్స పొందుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, నాయకురాలు మండ సదాలక్ష్మి, సంపత్‌, గోగుల రమణ, వల్లెపురాధ, యాదమ్మ, ఓరుగంటి లావణ్య, ఐలమ్మ, స్రవంతి, రమ్య, శైలజ, మౌనిక, మమత, సంధ్యరాణి, పద్మ, సునీత తదితరులతో పాటు తీవ్రగాయాల పాలైన గుడిసెవాసులను పరామర్శించారు. అనంతరం సిపిఐ నాయకుల బృందం వరంగల్‌ పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషిని కలిసి దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు రక్షణ కల్పించాలని వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు, స్థానిక కార్పోరేటర్‌ అండతో భూకబ్జాదారులు ఈ దాడికి పాల్పడ్డారని, ఇలాంటి దాడులకు భయపడి వెనుకడుగువేసేది లేదని, ఇండ్ల స్థలాలు సాధించే వరకు పోరాడుతామని ప్రకటించారు. బాధితులను పరామర్శించిన వారిలో మాజీ ఎంఎల్‌ఎ పోతరాజు సారయ్య, సిపిఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ వలీ వుల్లా ఖాద్రి, జిల్లా నాయకులు మద్దెల ఎల్లేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్‌ తదితరులు ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments