భారత్ కొత్త నిబంధనలపై ట్విట్టర్ ఆందోళన
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటి నిబంధనల కారణంగా ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉం దని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలపై స్పంది స్తూ, భారత ప్రజలకు అత్యుత్తమ సేవలు అం దించడానికి ఎప్పుడూ కట్టబడి ఉంటామని, బహిరంగ చర్చల్లో ఎప్పటి మాదిరిగానే కీలక పాత్ర పోషిస్తామని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్ కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలను పాటించేందుకు ప్రయత్నిస్తామని ఆ ప్రకటనలో వివరించింది. అయితే, ప్రజల భావ స్వేచ్ఛ అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొం ది. ఇటీవల కాలంలో, భారత్‌లో తమ సంస్థ ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే, తాము సేవలు అందిస్తున్న వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఈ కొత్త నిబంధనల వల్ల ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని స్పష్టమవుతున్నట్టు తెలిపింది. ఈ అంశమే తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నదని వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న సమయంలో, ప్రజలకు ట్విటర్ అండగా ఉందని, వారి ఆశలు, ఆకాంక్షలు, సమస్యలు, అభిప్రాయాలకు ఇతోథిక ప్రాధాన్యం ఇచ్చిందని వివరించింది. భారత ప్రజలకు ఇలాంటి అత్యుత్తమ సేవల అందించే దిశగా, కొత్త నిబంధనలను పాటించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. అదే సమయంలో కంపెనీ అమలు చేస్తున్న పారదర్శక సూత్రాలకు విఘాతం కలగకుండా జాగ్రత్త పడతామని తేల్చిచెప్పింది. తమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాలు పోలీసులతో బెదిరింపు చర్యలకు పాల్పడటం, ఇలాంటి చట్టాలు తీసుకురావడం బాధాకరమని ట్విటర్ తన ప్రకటనలో వ్యాఖ్యానించింది. తమ సేవల ద్వారా ప్రతి ఒక్కరి గళాన్ని వినిపించేందుకు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని తెలిపింది. సామాజిక మాధ్యమాల వేదికల్లో స్వేచ్ఛాయుత బహిరంగ చర్చలకు భంగం వాటిల్లకుండా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని భారత్‌ను కోరినట్టు తెలిపింది. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామని తెలిపింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. ప్రజాస్వామిక విధానంలో ఎన్నికైన ప్రభుత్వమే ప్రజాప్రయోజనాలను పరిరక్షించాలని స్పష్టం చేసింది. ’కాంగ్రెస్ టూల్‌కిట్’ వ్యవహారంలో ట్వటర్, కేంద్రం మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ టూల్‌కిట్ అంటూ బిజెపి నేతలు చేసిన పోస్ట్‌కు ట్విటర్ ’నకిలీ మీడియా’ అనే ట్యాగ్‌కు జత చేయడం వివాదానికి కారణమైంది. ట్విటర్‌కు ఈ విషయంలో కేంద్రం నోటీసులు జారీ చేసింది. వాటిని ఢిల్లీ పోలీస్‌లు స్వయంగా ట్విటర్ ఇండియా కార్యాలయానికి వెళ్లిమరీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. భారత ప్రభుత్వంతో చాలాకాలంగా జరుగుతున్న ఘర్షణపై ట్విటర్ తొలిసారి స్పందించింది. అయితే, ఈ ప్రకటనలో ప్రభుత్వ చట్టాలను, నిబంధనలను అమలు చేస్తామని ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. అంతేగాక, కొత్త నిబంధనల కారణంగా ప్రజలు తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించడం ద్వారా తన అభిప్రాయాలను చెప్పకనే చెప్పింది.
స్థానిక చట్టాలకు
కట్టుబడి ఉంటాం
మౌంటైన్‌వ్యూ (కాలిఫోర్నియా): ఏ దేశమైనా అక్కడి స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటామని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఐటీ నియమ నిబంధనలను అమలు చేస్తామని పేర్కొన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవలంబించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతోకలిసి గూగుల్ పని చేస్తుందని ఆసియా పసిఫిక్ రిపోర్టర్లతో జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ పిచాయ్ తెలిపారు. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ అనేది భారత్‌లో ఎంతోకాలంగా ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఆ విలువలు, వాటి ప్రయోజనాల గురించి తమకు తెలుసునని అన్నారు. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ వినియోగానికి ప్రపంచవ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతోనైనా కలిసి పనిచేస్తామని, సంపూర్ణ సహకారం అందిస్తామని పిచాయ్ అన్నారు. ప్రభుత్వం కోరిన విధంగా మార్పులను కూడా తమ నివేదికల్లో పొందుపరుస్తామని తెలిపారు. ఆయా ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు, న్యాయపరమైన ప్రక్రియలు, విధానాలను గౌరవిస్తామని, అదే క్రమంలో భారత్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. భారత్ రెగ్యులేటరీ విధానాలకు కట్టుబడి ఉంటామన్నారు.