ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. రుతుపవనాల ద్రోణి ఆదివారం ఇస్సార్, ఢిల్లీ, సిధి, బాలంగీర్, కళింగపట్నం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని చెప్పింది. ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 4.5 కి.మీ వరకు కేంద్రీకృతమై ఉందని వివరించింది. ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ఇప్పటికే కురుస్తున్న భారీ వరాలతో పలు జిల్లాల్లోని వాగులువంకలు పొంగిపొర్లుతున్నాయి. కుంటలు, అలుగురు పారుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌సహా పలు నగరాలు, పట్టణాల్లోనేగాక, గ్రామాల్లోనూ సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. గత రెండు రోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీనితో పంట పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలను నడపడాన్ని పక్కకు ఉంచితే, కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్‌లో రామయ్యబౌలి, ఎనుగొంత తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. రాయికోడ్ మండలంలోని పలు గ్రామాల్లో భారీగా నీటరు చేరి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటిలో మునిగి, రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు డ్యామ్ వరద నీటితో పోటెత్తింది. దీనితో గేట్లు ఎత్తేశారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాగులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సదరు వ్యక్తులను మధ్యప్రదేశ్కు చెందిన తోమర్ సింగ్, మహారాష్ట్రలోని ముంబయి వాసి సురేష్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. కడపటి వార్తలు అందే వరకూ గల్లంతైన వారి జాడ తెలియరాలేదు.
ఎపిలోనూ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లోనూ రాగల 24 గంటల్లోభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించంది. సోమవారం, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితర ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిది. సోమవారం తీరం వెంబడి 40 నుంచి -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఇటీవల కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో చెరవులు, ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. అయితే, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఫలితంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాలు
RELATED ARTICLES