భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు

న్యూజిలాండ్‌ సారధి కేన్‌ విలియమ్సన్‌
ఆక్లాండ్‌: రెండో టి20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని, వారికే ఈ విజయం సొంతమని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నారు. మ్యాచ్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భారత బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. ‘ఇది మాకు కఠినమైన రోజు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ రోజు పిచ్‌ విభిన్నంగా ఉంది. మరో 15-20 పరుగులు చేసుంటే బాగుండేది. మా ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌లు మంచి ఆరంభమే ఇచ్చారు. దానిని మేం కొనసాగించలేకపోయాం. నాతో పాటు అందరం విఫలమయ్యాం. చిన్న మైదానంలో 132 పరుగులే చేసినప్పటికీ.. మా బౌలర్లు మంచి శుభారంభాన్నే అందించారు. ఆరంభంలోనే రెండు ప్రధాన వికెట్లు తీశారు. అయితే అదే ఒత్తిడిని టీమిండియాపై కొనసాగించలేకపోయాం.’ అని విలియమ్సన్‌ తెలిపాడు. ’మా స్పిన్నర్లు టీమిండియా బ్యాట్స్‌మన్‌పై ప్రభావం చూపలేకపోయారు. అయితే మా స్పిన్నర్లను నిదించడం లేదు. ఎందుకంటే.. స్పిన్‌ బౌలింగ్‌లో ఆడటం భారత బ్యాట్స్‌మెన్‌కు ఎంతో అనుభవం ఉంది, టాప్‌ క్లాస్‌ ప్లేయర్లు జట్టులో ఉన్నారు. బ్యాటింగ్‌లో మరో 15 నుంచి -20 పరుగులు చేసినా, బౌలర్లు మధ్యలో మరో రెండు వికెట్లు పడగొట్టిన ఫలితం వేరేలా ఉండేది. మా తప్పిదాల గురించి చర్చించుకుంటాం. తర్వాతి మ్యాచ్‌లలో మెరుగ్గా ఆడేందుకు కృషి చేస్తాం’ అని విలియమ్సన్‌ చెప్పాడు. ’భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పేస్‌, స్పిన్‌ బాగుంది. సరైన సమయాలలో వికెట్లు తీస్తూ మాపై ఒత్తిడిపెంచారు. ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ మొత్తం వాళ్లదే. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు ఈ విజయానికి అన్నిరకాల అర్హులే. కఠినమైన ప్రత్యర్థి కాబట్టి మరింత మెరుగ్గా ఆడాల్సి ఉండే. ఏదేమైనా పటిష్ట జట్టుపై మా ఆటను పరీక్షించుకుంటాం’ అని విలియమ్సన్‌ చెప్పుకొచ్చాడు.

DO YOU LIKE THIS ARTICLE?