జైపూర్: ప్రతి సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ ‘భారత్ మాతాకీ జై’ అంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడంపై మోడీ మంగళవారం ధ్వజమెత్తారు. లక్షలాది ప్రజల ముందు పది సార్లయినా అదే నినాదం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల ర్యాలీల్లో ‘భారత్ మాతాకీ జై’ చెప్పడాన్ని మోడీ మానుకోవాలనడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో లక్షలాది ప్రజల సమక్షంలో ‘నేను 10సార్లయినా భారత్ మాతాకీ జై అంటాను’ అన్నారు. స్వాతంత్య్ర సమర యోధులు ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తునే ప్రాణ త్యాగాలుచేశారన్నారు. ‘మన సైనికులు మెరుపుదాడి(సర్జికల్ స్ట్రయిక్స్) చేసినప్పుడు కూడా భారత్ మాతాకీ జై అన్నారు. మీరు భారత్ మాతాను అవమానిస్తున్నారు’ అని మోడీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అసలు జరిగిందేమిటంటే ఒక ర్యాలీలో రాహుల్ ‘ప్రతి సభలోనూ ప్రధాని భారత్ మాతాకీ జై అంటారు. కానీ అనిల్ అంబానీకి పనిచేస్తారు. ఇకపైన ఆయన అనిల్ అంబానీకి జై, మెహుల్ చోక్సీకి జై, నీరవ్ మోడీకి జై, లలిత్ మోడీకి జై అంటే బాగుంటుంది’ అన్నారు. దానిపై మోడీ ప్రతిస్పందిస్తూ ఒక్కసారి పదిసార్లన్నా ‘భారత్ మాతాకీ జై’ అంటానన్నారు. రాజస్థాన్‌లో కొన్నేళ్లపాటు కాంగ్రెస్ పార్టీని ప్రవేశింపనివ్వొద్దన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలు డిసెంబర్ 7న జరగనున్నాయి.
‘భారత్ మాతాకీ జై’ అని పదిసార్లంటాను
RELATED ARTICLES