భారత్‌ బోణీ

తొలి టెస్టులో 203 పరుగులతో విజయం
చిత్తు చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
మూడు టెస్టుల సిరీస్‌లో 1 ఆధిక్యంలో భారత్‌
ఐసిసి టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానంలో టీమిండియా
విశాఖ : సాగర తీరంలోని వైఎస్‌ఆర్‌ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 203 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1 ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం నమోదు చేసింది. చివరి రోజున రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించడంతో& సఫారీల ఆట సాగలేదు. 395 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పర్యాటక జట్టు 191 పరుగులకు కుప్పకూలింది. చివరి రోజు 9 వికెట్లు పడగొట్టి విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్న టీమిండియా అనుకున్నట్లుగానే పక్కా వ్యూహాలు అమలుచేసింది. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే అశ్విన్‌.. డిబ్రుయిన్‌(10)ను బౌల్‌ చేయగా తర్వాతి ఓవర్‌లో మహ్మద్‌ షమి బవుమా(0)ను పెవిలియన్‌ చేర్చాడు. ఆపై వెనువెంటనే డుప్లెసిస్‌(13), డికాక్‌(0)లను కూడా షమి బౌల్‌ చేయగా సౌతాఫ్రికా 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం జడేజా.. ఫిలాండర్‌(0), కేశవ్‌ మహారాజ్‌(0), మార్‌క్రమ్‌(39)లను ఔట్‌ చేయడంతో టీమిండియా గెలుపు లాంఛనమే అయింది. అయితే ముత్తుసామి(49; 108 బంతుల్లో 5స4), డేన్‌పీట్‌(56; 107 బంతుల్లో 9స4 1స6) పట్టుదలగా ఆడి 91 పరుగుల పార్టనర్‌షిప్‌ నెలకొల్పారు. ఈ క్రమంలో షమి 60వ ఓవర్‌లో పీట్‌ను బౌల్‌ చేసి టీమిండియాకు మరోసారి బ్రేక్‌ ఇచ్చాడు. చివరగా రబాడ(18; 19 బంతుల్లో 3స4, 1స6) క్రీజులోకి వచ్చి మెరుపు బ్యాటింగ్‌ చేసినా షమి బౌలింగ్‌లోనే కీపర్‌కు క్యాచ్‌ వెనుదిరిగాడు. షమి 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. ఫలితంగా 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా చేతులెత్తేసింది. టెయిలెండర్లు శ్రమించినా& 191 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఈ క్రమంలో కోహ్లీ టీం ప్రత్యర్థిని చిత్తుచేసి& తొలి టెస్టును కైవసం చేసుకుంది. 87 పరుగలకు 4 వికెట్లు పడగొట్టి& రవీంద్ర జడేజా& 35 పరుగులకే 5 వికెట్లు తీసి మహ్మద్‌ షమి& టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో వికెట్‌ తీసుకున్నాడు.
అనుకోవాలే గానీ 20, 30 మీటర్లు వెనక్కి వెళ్లి మరీ క్యాచ్‌లు అందుకోగలడు. బౌండరీ సరిహద్దు నుంచి బంతిని నేరుగా వికెట్లకు విసరగలడు. తన ఒంటిని వింటిలా వంచగలడు. తన అథ్లెటిక్‌ శరీర స్వభావంతో జడ్డూ అసాధ్యం అనిపించే క్యాచ్‌లెన్నో పట్టుకున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులోనూ జడ్డూ ఓ అద్భుతం చేశాడు. ఎవరికీ సాధ్యంకాని రీతిలో బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. జడ్డూ వేసిన 26.1వ బంతిని అయిడెన్‌ మార్‌క్రమ్‌ (39; 74 బంతుల్లో 5స4, 1స6) బౌలర్‌ వైపునకే ఆడాడు. తనపైకి వస్తున్న బంతిని చూసి చురుకుగా స్పందించిన జడేజా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. దాంతో ఆశ్చర్యపోవడం మార్‌క్రమ్‌ వంతైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో జడ్డూ 6 వికెట్లు తీశాడు. మార్‌క్రమ్‌ను ఔట్‌ చేసిన ఓవర్లోనే నాలుగో బంతికి ఫిలాండర్‌ (0), ఐదో బంతికి కేశవ్‌ మహరాజ్‌ (0)ను పెవిలియన్‌ పంపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా ఈ మ్యాచ్‌లో 203 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రెచ్చిపోయిన షమీ..
11/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే డిబ్రుయిన్‌ (10)ను రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌల్‌ చేసాడు. ఇక ఆ తర్వాతి ఓవర్‌లో పేసర్‌ మహ్మద్‌ షమీ ..తెంబ బువుమా (0)ను పెవిలియన్‌ చేర్చాడు. పిచ్‌ నుంచి బౌన్స్‌, స్వింగ్‌ రాబడుతూ మరింత రెచ్చిపోయిన షమీ.. 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను తీసి దక్షిణాఫ్రికా టాపార్డర్‌ వెన్నువిరిచాడు. డుప్లెసిస్‌ (13), డీకాక్‌ (0)లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రవీంద్ర జడేజా తన స్పిన్‌ మాయాజాలం చూపించాడు. బంతిని రెండు వైపులకు తిప్పుతూ సఫారీలను ముప్పుతిప్పలు పెట్టాడు. 10 పరుగుల వ్యవధిలో మార్కరమ్‌ (39),ఫిలిండర్‌ (0), మహరాజ్‌ (0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీలు 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే సేనురాన్‌ ముత్తుసామి, డేన్‌ పీడ్ట్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. లంచ్‌ సమయానికి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు.
డేన్‌పీట్‌ అద్భుత పోరాటం:
లంచ్‌ అనంతరం కూడా ముత్తుసామి, డేన్‌పీట్‌ అద్భుత పోరాటం చేశారు. ఈక్రమంలోనే డేన్‌పీట్‌ (56) హాఫ్‌ సెంచరీ చేసాడు. అంతేకాదు వీరిద్దరు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ప్రొటీస్‌ స్కోర్‌ బోర్డు ముందుకు సాగింది. అయితే హాఫ్‌ సెంచరీ చేసిన డేన్‌పీట్‌ను షమీ బోల్డ్‌ చేసాడు. దీంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. డేన్‌పీట్‌ ఔటైన తర్వాత కగిసో రబడా (18) క్రీజ్‌లో నిలవలేదు. రబడాను షమీ ఔట్‌ చేసి భారత్‌కు విజయం ఖాయం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో షమీ ఐదు వికెట్లు తీయగా.. జడేజా నాలుగు వికెట్లు సాధించాడు. అశ్విన్‌కు వికెట్‌ దక్కింది. కాగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 502/7 స్కోర్‌ వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ లో 323/4 వద్ద డిక్లేర్డ్‌ చేయగా.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 191 పరుగులకు ఆలౌట్‌ అయింది. మయాంక్‌ అగర్వాల్‌ డబుల్‌ సెంచరీ.. రోహిత్‌ రెండు సెంచరీలు చేశారు. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన రోహిత్‌ శర్మకు ’మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
అశ్విన్‌ అరుదైన రికార్డు..
ఆదివారం పేసర్‌ మహ్మాద్‌ షమీ, స్పిన్నర్‌ రవీంద్ర జడేజా పోటీపడి తలో మూడు వికెట్లు తీశారు. ఇక స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ రోజు వికెట్ల వేటను ఆరంభించాడు. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే డిబ్రుయిన్‌ (10)ను అశ్విన్‌ బౌల్‌ చేసాడు. ఈ వికెట్‌ తీయడంతో అశ్విన్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో వేగవంతంగా 350 వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు. మురళీధరన్‌ 66వ టెస్టులో 350 వికెట్లు తీయగా.. అశ్విన్‌ సైతం అన్నే టెస్టుల్లో 350 వికెట్లు సాధించాడు. దీంతో తక్కువ టెస్టుల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన రికార్డును అశ్విన్‌ సొంతం చేసుకున్నాడు. వేగవంతంగా 350 వికెట్లట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా కూడా అశ్విన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే 77వ టెస్టులో ఈ ఫిట్‌ చేరుకోగా.. వెటరన్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ 83వ టెస్టులో 350 వికెట్లు సాధించాడు. ఈ టెస్టుకు ముందు 350 వికెట్లు సాధించడానికి అశ్విన్‌ ఎనిమిది వికెట్ల దూరంలో ఉండగా.. త్వరగానే ఆ మైలురాయిని అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన స్పిన్‌ మ్యాజిక్‌ను చూపించి 7 వికెట్లు తీసాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ తీసి ఈ అరుదైన ఘనతను తన పేరుపై లికించుకున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?