రెండో సెమీస్లో సఫారీలపై కంగారూల విజయం
వరుసగా ఆరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా
సిడ్నీ: ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. వర్షం కారణంగా కుదించిన రెండో సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అద్వితీయ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఓడించి వరుసగా ఆరో సారి మెగాటోర్నీ ఫైనల్ చేరుకుంది. దక్షిణాఫ్రికా పురుషుల మాదిరిగానే మహిళల ఆశలనూ వరుణుడే అడియాసలు చేశాడు! వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆతిథ్య ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49*; 49 బంతుల్లో 4×4, 1×6)కు తోడుగా బెత్ మూనీ (28; 24 బంతుల్లో 4×4), అలీసా హేలీ (18; 13 బంతుల్లో 4×4), రేచెల్ హేన్స్ (17; 18 బంతుల్లో) రాణించడంతో ఆసీస్ 134/5 పరుగులు చేసింది. నదీన్ డి క్లెర్క్ 3 వికెట్లు తీసింది. ఛేదనలో వరుణుడు మరోసారి అంతరాయం సృష్టించడంతో సఫారీల లక్ష్యం 13 ఓవర్లకు 98గా నిర్ణయించారు. ఓపెనర్లు లిజెల్ లీ (10), నీకెర్క్ (12) విఫలమయ్యారు. 5 ఓవర్లకే 24/3తో కష్టాల్లో పడ్డ ఆ జట్టును సున్ లూ (21; 22 బంతుల్లో 2×4), లారా వోల్వార్డ్ (41*; 27 బంతుల్లో 3×4, 2×6) గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా శ్రమించారు. కానీ ఉత్కంఠతో ఊపేసే భారీ మ్యాచులు గెలిచిన అనుభవంతో కంగారూలు పైచేయి సాధించారు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా 19 పరుగులు చేయాల్సి ఉండగా జెస్ జొనాసెన్ తొలి బంతికి వికెట్ తీసి 13 పరుగులే ఇచ్చింది. పిక్క గాయంతో మ్యాచ్కు దూరమైన ఎలిస్ పెర్రీ విజయం సాధించగానే మైదానంలోకి వచ్చి సహచరులను హత్తుకుంది. లీగ్ దశలో వరుస విజయాలు సాధించిన సఫారీలు ఎంతో నిరాశ, కన్నీటితో మైదానం వీడారు.
భారత్ ప్రత్యర్థి ఆసీస్
RELATED ARTICLES