చెలరేగిన లియాన్, స్టార్క్, రెండో టెస్టులో 146 పరుగులతో ఆస్ట్రేలియా జయకేతనం, 1-1తో సిరీస్ సమం
పెర్త్: తొలి టెస్టులో ఘన విజయం సాధించి టెస్టు సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన కోహ్లీ సేన రెండో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో భారత్ కంటే ఆస్ట్రేలియానే ఎక్కువ పరుగులు సాధించింది. తొలి టెస్టులో సమిష్టిగా రాణించిన భారత బ్యాట్స్‌మెన్స్ రెండో టెస్టులో మాత్రం రాణించలేక పోయారు. మరోవైపు పిచ్‌ను అంచనా వేయడంలో కెప్టెన్ కోహ్లీ విఫలమయ్యాడు. పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని భావించి స్పిన్నర్ లేకుండానే భారత జట్టు మైదానంలో అడుగుపెట్టింది. కానీ, కోహ్లీ అంచనాలు తారుమారయ్యాయి. పేస్‌కు అనుకూలిస్తుందని భావించిన పిచ్‌పై ఆసీస్ స్పిన్నర్ చెలరేగి బౌలింగ్ చేశాడు. ఇతని ధాటికి భారత బ్యాట్స్‌మెన్స్ విలవిలలాడారు. మ్యాచ్‌లో మరో మలుపు అంపైర్ నిర్ణయం.. సెంచరీతో జోరుమీదున్న కోహ్లీ అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల పెవిలియన్ చేరాడు. బ్యాట్స్‌మెన్స్ వైఫల్యం చెందడంతో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 146 పరుగులతో ఓటమి పాలైంది. 287 పరుగుల లక్ష్యంతో రెండో ఇనింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు 56 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆసీస్ 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్స్ తీవ్రంగా నిరాశ పరిచారు. కలిసి కట్టుగా పరుగులు చేస్తే భారత్‌కు ఈజీగా విజయం దక్కేది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అందరూ నిరాశ పరిచారు. టీమిండియాలో రహానే (30), రిషభ్ పంత్ (30) పరుగులే టాప్ స్కోరర్లుగా నిలువడం గమనార్హం. ఓపెనర్లు పేలవమైన ఆటతో మరోసారి నిరాశే మిగిల్చారు. సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న కెఎల్. రాహుల్ (0) రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరువకుండానే ఇంటిముఖం పట్టాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ (20) పరుగులు చేసినా భారీ స్కోరు నమోదు చేయడంలో వైఫల్యమయ్యాడు. తొలి టెస్టులో ఆకట్టుకున్న చతేశ్వర్ పుజారా రెండో టెస్టులో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన భారత సారథి విరాట్ కోహ్లీ రెండో ఇనింగ్స్‌లో మాత్రం 17 పరుగులకే ఔటయ్యాడు. మిడిల్ ఆర్డర్‌లో అజింక్యా రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్ పర్వాలేదనిపించినా పెద్ద స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు ఖాతా తెరువ కుండానే పెవిలియన్ చేరారు. తోక బ్యాట్స్‌మెన్స్ మరోసారి తమ పేలవమైన బ్యాటింగ్‌ను పునరావృతం చేయడంతో భారత్ చివరి ఐదు వికెట్లను కేవలం 21 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. మరోవైపు చివరి మూడు వికెట్లు ఒక్క పరుగు వ్యవధిలోనే చేజార్చుకోవడం చింతించే విషయం. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో తమ జట్టుకు గొప్ప విజయాన్ని అందించారు. ముఖ్యంగా స్పిన్నర్ నాథన్ లియాన్ విజృంభించి బౌలింగ్ చేసి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మిచెల్ స్టార్క్ కూడా మూడు వికెట్లు తీసి చెలరేగాడు. ఇతర బౌలర్లలో హేజిల్‌వుడ్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు తీసి విజయంలో తమవంతు సహకారం అందించారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 9 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ లియాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆదిలోనే ఎదురుదెబ్బ…
మంగళవారం 112/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపడుతున్న టీమిండియాపై ఆసీస్ బౌలర్లు ఎదురుదాడికి దిగారు. నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. ఓవర్‌నైట్ స్కోరుకు మరో ఏడు పరుగులు జోడించిన అనంతరం కుదురుగా ఆడుతున్న తెలుగబ్బాయి హనుమ విహారి (28; 75 బంతుల్లో 4 ఫోర్లు)ను మిచెల్ స్టార్క్ తెలివైన బంతితో హారిస్‌చే క్యాచ్ పట్టించి పెవిలియన్ పంపాడు. విహారి ఔటైన తర్వాత భారత్ విజయ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. తర్వాత వచ్చిన ఉమేష్ యాదవ్‌తో కలిసి రిషభ్ పంత్ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. ఒకవైపు పంత్ ధాటిగా ఆడుతుంటే మరోవైపు ఉమేశ్ యాదవ్ అతనికి స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే వీరు ఏడో వికెట్‌కు 18 పరుగులో జోడించారు. కానీ ఆతర్వాత నాథన్ లియన్ భారత్ మరో పెద్ద షాకిచ్చాడు. సమన్వయంతో ఆడుతున్న రిషభ్ పంత్ (30; 61 బంతుల్లో 2 ఫోర్లు)ను లియాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్ 137 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. తర్వాత పుంజుకున్న ఆసీస్ బౌలర్లు మరింతగా రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. వీరి ధాటికి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొదట కుదురుగా ఆడుతున్న ఉమేశ్ యాదవ్ 23 బంతుల్లో 2 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాంత్ శర్మ (0), జస్ప్రీత్ బుమ్రా (0)లను కమ్మిన్స్ ఖాతా తెరువకుండానే పెవిలియన్ పంపాడు. మరోవైపు మహ్మద్ షమీ (0) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టు 56 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైపోయింది. ఆస్ట్రేలియాకు 146 పరుగుల భారీ విజయం దక్కింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా (72) పరుగులు చేసి తమ జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు.
భారత్ పరాజయం
RELATED ARTICLES