భారత్‌లోనూ…. జాత్యాహంకార తరహా దాడులు

ట్రంప్‌, మోడీలిద్దరివీ ఫాసిస్ట్‌ ఆలోచనాధోరణి
సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నందునే ఇరువురి మధ్య గాఢస్నేహం
సిఆర్‌ స్మారకోపన్యాసంలో సురవరం సుధాకర్‌రెడ్డి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : అమెరికాలో ఆఫ్రో అమెరికన్‌లపై జరుగుతున్న దాడులకు, భారతదేశంలో దళిత, మైనారిటీ, బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులకు సారూప్యత ఉన్నదని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోడీల స్నేహానికి, అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ఇద్దరికీ సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నదన్నారు. వారిద్దరిదీ ఫాసిస్టు ఆలోచన ధోరణి అని, వారు పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు కట్టుబడి ఉన్నారని విమర్శించారు. కమ్యూనిస్టు అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు 106వ జయంతి సందర్భంగా సి.ఆర్‌.ఫౌండేషన్‌ శనివారం ఏర్పాటు చేసిన స్మారకోపన్యాసంలో “జాత్యాహంకారం- ప్రతిఘటనా పోరాటం” అనే అంశంపై సురవరం సుధాకర్‌రెడ్డి జూమ్‌ యాప్‌ ద్వారా ప్రసంగం చేశారు. అత్యంత బలహీనవర్గాల అణిచివేతకు అమెరికాలో జాత్యాహంకారం, మనదేశలంలో ఆధిపత్య కులాల హిందూత్వ దురహంకారమే కారణాలని, ఇవి రెండూ ఒకదానికి ఒకటి కలుస్తాయని చెప్పారు. అన్ని రకాల వివక్షలు పెట్టబడిదారీ వ్యవస్థలో అవిభాజ్య భాగాల ని, సోషలిజమే ఆ సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో ఇప్పటికీ వర్ణ వివక్ష కొనసాగుతోందని, సమానత్వం, హక్కుల కోసం పోరాటాలు సాగుతున్నాయన్నారు. తాజాగా నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య అత్యంత అమానుషమైనదని, దీనికి వ్యతిరేకంగా శతాబ్దాల తరబడి వివక్షతను, అవమానాలను సహించబోమంటూ నల్లజాతీయులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు. అయితే, నిరనసలను సానుభూతితో, శాంతియుతంగా అర్థం చేసుకోవాల్సిన ట్రంప్‌ మాత్రం సైన్యంతో అణిచి వేస్తామనడం దారుణమన్నారు. ట్రంప్‌ ఆదేశాలను పట్టించుకోకుండా రాజ్యాంగానికే తాము కట్టుబడి ఉన్నామని అమెరికన్‌ సైన్యాధిపతి చెప్పడం హర్షణీయమన్నారు. శ్వేత జాతీయులు కూడా నిరసనలకు మద్దతు తెలుపుతుంటే, నల్లజాతీయులు లూటీలు, దాడు లు చేస్తున్నారని జాత్యాహంకారాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని సురవరం తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేరుగా జరిగి, ప్రతి పౌరుడే ఎన్నుకోవాల్సి వస్తే ట్రంప్‌ ఘోరంగా ఓడిపోతారని అన్నారు. అయితే అక్కడ ఎలక్టోరల్‌ పద్ధతిలో పరోక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని, మనదగ్గర రిగ్గింగ్‌ లాగే అక్కడ కూడా వివిధ రకాల వత్తిళ్ళతో ట్రంప్‌ గత ఎన్నికల్లో గెలవగలిగారని చెప్పారు. ఈసారి మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ప్రతిఘటన పెరుగుతోందన్నారు. మన దగ్గర కూడా 70 శాతం ప్రజలు మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నారని, విభిన్న పద్ధతుల్లో పోరాడుతున్నారని తెలిపారు. స్వతంత్ర అలీన విధానం నుండి వైదొలగి మోడీ ప్రభుత్వం అమెరికా అనుకూల సామ్రాజ్యవాద విధానం వైపు వెళ్తోందని, దీనిని వామపక్షాలు, ఇతర పార్టీలు ఎండగట్టాయన్నారు. అయితే వీటికి మీడియాలో సరైన ప్రాధాన్యం రావడం లేదని, ఇందుకు దేశంలోని 900 పైచీలుకు టివి ఛానళ్ళలో 735, ప్రింట్‌ మీడియాలో మెజారిటీ పత్రికలు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో ఉండడమే కారణమన్నారు. చివరకు సోషల్‌ మీడియాను కూడా నియంత్రించి తమకు అనుకూల ప్రచారమే సాగేలా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమానికి సిఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ కె.నారాయణ మోడరేటర్‌గా వ్యవహరించారు.
(పూర్తి ప్రసంగపాఠం ఎడిటోరియల్‌ పేజీలో)

DO YOU LIKE THIS ARTICLE?