శతక్కొట్టిన రోహిత్..
అదరగొట్టిన ఆల్‌రౌండర్లు!
నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో టీమిండియా తన జోరు కొనసాగిస్తోంది. రెండో రోజు ఆటలోనూ రోహిత్ సేన ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 120) సెంచరీతో చెలరేగగా.. ఆల్‌రౌండర్లు రవీండ్ర జడేజా(170 బంతుల్లో 9 ఫోర్లతో 66 బ్యాటింగ్), అక్షర్ పటేల్(102 బంతుల్లో 8 ఫోర్లతో 52 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 114 ఓవర్లలో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ముర్ఫీ(5/82) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. నాథన్ లియోన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం భారత్ 144 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మరో 50 పరుగుల ఆధిక్యం అందుకుంటే దాదాపు ఈ మ్యాచ్ భారత్ వశమైనట్లే. ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. కెప్టెన్ రోహిత్ శర్మకు అండగా అశ్విన్ రాణించాడు. ఓ సిక్స్, రెండు బౌండరీలతో అటాకింగ్ గేమ్ ఆడాడు. క్రీజులో సెట్ అవుతున్న ఈ జోడీని ముర్ఫీ విడదీసాడు. అశ్విన్(23)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.అంపైర్ ఔటివ్వకపోయినా.. రివ్యూ తీసుకొని ఆసీస్ ఫలితం సాధించింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(7) ఆసీస్ ట్రాప్‌లో పడ్డాడు. ఫైన్ లెగ్ ఫీల్డర్‌తో వ్యూహం రచించిన ఆసీస్ పుజారాను బుట్టలో వేసుకుంది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(12)తో రోహిత్ మరో వికెట్ పడకుండా ఆడటంతో భారత్ 151/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో లంచ్ బ్రేక్ వెళ్లింది. లంచ్ విరామం తర్వాత తొలి బంతికే విరాట్ కోహ్లీ (12) ముర్ఫీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో జోరు కనబర్చాడు. లయ న్ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 168 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్.. ఆలౌట్ అవుతుందా? అనిపించింది. కానీ క్రీజులోకి వచ్చిన జడేజాతో రోహిత్ పోరాడాడు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్..ముర్ఫీ బౌలింగ్‌లో బౌండరీ బాది సెంచరీ సాధించాడు. రోహిత్‌కు ఇది 9వ టెస్ట్ సెంచరీ కాగా.. ఓపెనర్‌గా 6వ టెస్ట్ శతకం. జడేజా సైతం పిచ్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేస్తూ నిలదొక్కుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు విశ్వ ప్రయత్నం చేసిన కెప్టెన్ కమిన్స్.. చివరకు తానే రంగంలోకి దిగాడు. అద్భుత డెలివరీతో రోహిత్ ఆటకు బ్రేక్‌లు వేసాడు. స్మిత్ క్యాచ్ చేజార్చినా.. క్లీన్ బౌల్డ్నే రోహిత్‌ను పెవిలియన్ చేర్చాడు. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీకర్ భరత్(8)సైతం నిరాశపరిచాడు. పటేల్ సాయంతో 114 బంతుల్లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ సైతం ఆసీస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 8 బౌండరీలతో 94 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆట చివరి ఓవర్లో జడేజా ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ నేలపాలు చేశాడు.
రెండేళ్ల తర్వాత టెస్టు సెంచరీ..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో 9వ శతకం బాదేశాడు. కీలకమైన బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ లో ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనే మూడంకెల మార్క్‌ను దాటాడు. రెండేళ్ల తర్వాత రోహిత్ బ్యాట్ నుంచి జాలువారిన టెస్టు సెంచరీ కావడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇంతకుముందు 2021లో ఇంగ్లాండ్‌పై శతకం బాదాడు. బౌలింగ్‌కు అనుకూలంగా మారిన నాగ్‌పుర్ పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేయగా.. రోహిత్ శర్మ మాత్రం సహనంతో ఆడి సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ సాధించిన రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, ఫాఫ్ డుప్లెసిస్, తిలకరత్నె దిల్షాన్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఇప్పుడు వారి సరసన రోహిత్ చేరాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 43 శతకాలను పూర్తి చేశాడు. ఇందులో టెస్టుల్లో 9, వన్డేల్లో 30, టీ20ల్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (42) సెంచరీల రికార్డును అధిగమించాడు.