భద్రతా మండలిలోకి మరోసారి భారత్‌

ఐరాస ఎన్నికల్లో భారీ విజయం
ఐరాస: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్ర తా మండలిలోకి భారత్‌ మరోసారి చేరిం ది. దీనికి సంబంధించిన తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్‌ ఘన విజయం సాధించింది. శాశ్వత సభ్యత్వాన్ని కోరుతున్న భారత్‌ ఆ దిశగా మరో గెలుపు సాధించినట్లే. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌కు ఇంకోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. సమితిలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉండగా, భారత్‌కు 184 ఓట్లు లభించాయి. దీంతో రెండేళ్లపాటు (2021 22) భారత్‌ కొనసాగనుంది. ఐరాసలో సభ్యదేశంగా భారత్‌ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా గ్రూప్‌ నుంచి కేవలం భారత్‌ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది. అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంది. మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌), పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్‌ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేస్తుంది. మండలిలో కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. అయితే ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్యదేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం వ్యతిరేకించి వీటో చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. కాగా, విజయం సాధించిన భారత్‌ను చైనాతో సహా శాశ్వత సభ్యదేశాలన్నీ అభినందించాయి.
కీలక విజయమిది : మోడీ
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఐరాస ఎన్నికల్లో ఎలాంటి పోటీలేకుండా భారత్‌ విజయం సాధించడం గొప్ప పరిణామమని, ఇది కీలక విజయమని వ్యాఖ్యానించారు. శాంతి, సామరస్యత, సమానత్వం, భద్రత కోసం భారత్‌ ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?