లండన్: బ్రెగ్జిట్‌పై పార్లమెంటులో గురువారం చేపట్టిన కీలక విశ్వాస ఓటింగ్‌లో బ్రిటన్ ప్రధాని థెరెసా మే నెగ్గారు. రాబోయే 2022 సార్వత్రిక ఎన్నికల్లో తాను పార్టీకి సారథ్యం వహించబోనని ఆమె తిరుగుబాటు శాసనకర్తలను ప్రసన్నం చేసుకున్నాక ఈ ఓటింగ్‌లో నెగ్గారు. ప్రధాని పదవిలో ఉండేందుకు మద్దతులో నెగ్గినప్పటికీ కన్జర్వేటివ్ ఎంపీల్లో మూడవ వంతు మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. అయినప్పటికీ పార్లమెంటులో అసాధ్యమైన బ్రెగ్జిట్ ఓటింగ్‌లో ఆమె నెగ్గారు. బుధవారం జరిగిన రహస్య ఓటింగ్‌లో మొత్తం 317 కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఆమెకు అనుకూలంగా 200 ఓట్లు, వ్యతిరేకంగా 117 ఓట్లు వచ్చాయి. థెరెసా మే 63 శాతం ఓట్లను సాధించారు. బ్రెగ్జిట్ పాలసీ విశ్వాస ఓటింగ్‌లో నెగ్గేందుకు థెరెసాకు తన పార్టీలోని మెజారిటీ ఎంపీల, కనీసం 159 ఓట్లు గెలవాల్సి ఉండగా ఆమె 200 ఓట్లు పొందారు. ఒకవేళ ఆమె ఓడిపోయి ఉంటే పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవలసి వచ్చేది. ఆ కొత్త నాయకుడే బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉండేది. కానీ అంతా ఆమెకు అనుకూలంగానే జరిగింది. 28 మంది సభ్యులున్న యూరోపియన్ యూనియన్ నుంచి వైదులుగుతామని 2016 జూన్‌లో యుకె ఓటు వేసినప్పటి నుంచి ఆమె బ్రిటన్‌కు ప్రధానిగా కొనసాగుతున్నారు. బ్రెగ్జిట్ పాలసీపై ఆమె పార్టీకి చెందిన 48 మంది ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విశ్వాస ఓటింగ్ పెట్టాల్సి వచ్చింది. 2016 రెఫరెండం ఫలితాలను బ్రెగ్జిట్ పాలసీ మోసగించిందని ఆమెను వ్యతిరేకించిన ఎంపీలు అన్నారు. ‘నాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నాకు వ్యతిరేకంగా చాలా మంది సహచరులు ఓటేశారు. వారేమి చెప్పారో దానిని నేను విన్నాను’ అని ఫలితాలు వెలువడ్డాక ఆమె డోనింగ్ స్ట్రీట్ బయట ప్రకటన చేశారు. బ్రెగ్జిట్ ఒప్పందంలోని వివాదాస్పద అంశాలపై ఇక తాను యూరోపియన్ యూనియన్(ఇయు)తో చర్చిస్తానన్నారు. గురువారం జరగనున్న ప్రీషెడ్యూల్డ్ యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె బ్రస్సెల్స్ వెళ్లనున్నారు. బ్రిటన్ పార్లమెంటులో బ్రెగ్జిట్ పాలసీపై జరిగి విశ్వాస ఓటింగ్ ఫలితాలను 1922 కమిటీ చైర్పర్సన్ గ్రహం బ్రాడీ అధికారికంగా ప్రకటించారు. ‘థెరెసా మే 2022 సార్వత్రిక ఎన్నికల్లో పాలుపంచుకోరు. ఈ విషయంలో ఆమె స్పష్టంగా ఉన్నారు’ అని యుకె వర్క్ అండ్ పెన్షన్స్ శాఖ మంత్రి అంబర్ రుడ్ తెలిపారు. ఒకవేళ బ్రెగ్జిట్ ఒప్పందం అమలవుతే ఆ బ్రెగ్జిట్ డే… 2019 మార్చి 29న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుంది. ఈ విషయంలో ఇప్పటికీ బ్రిటన్ పార్లమెంటులోని ప్రతినిధుల సభలో అన్ని వర్గాల్లోనూ తీవ్ర అభిప్రాయభేదాలున్నాయి. బ్రిటన్, ఇయుల మధ్య బ్రెగ్జిట్ ఒప్పందం తర్వాత శాశ్వత పరిష్కారం కుదరకపోతే ఐరిష్ సరిహద్దులో చెక్పాయింట్లు అవసరమవుతాయి. ఇయు ఒప్పుకోకుండా ఒప్పందం నుంచి బ్రిటన్ బయటకు వెళ్లడం సాధ్యం కాదని విమర్శకులు వాదిస్తున్నారు. అంటే బ్రెగ్జిట్‌ను మించి ఇయు కస్టమ్స్ చట్టాలను బ్రిటన్ అనుసరించాల్సి ఉంటుంది.
బ్రెగ్జిట్‌పై విశ్వాస ఓటింగ్‌లో నెగ్గిన థెరెసా
RELATED ARTICLES