రాజీపడిన కేంద్రం, ఆర్‌బిఐ

కేంద్రప్రభుత్వం, భారత రిజర్వుబ్యాంక్‌(ఆర్‌బిఐ) మధ్య దాదాపు నెల రోజులుగా సాగుతున్న రగడకు సోమవారం తెరపడింది. బోర్డు సమావేశం లో ఇరుపక్షాలు తమ ప్రాథమిక వైఖరులను కొంత సడలించుకుని మధ్యేమార్గంపై అంగీకారానికి రావటం మంచి పరిణామం. మొత్తం 12 వివాదాస్పద అంశాల్లో కీలకమైన నాలుగింటిపై అంగీకారం కుదిరింది. బోర్డు సమావేశం 9గంటలపాటు జరిగిందంటే ఒక్కొక్క అంశంపై వాదప్రతివాదాలు ఎంత లోతుగా, తీక్షణంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఆర్‌బిఐ రిజర్వు నిధులనుంచి రూ.3.6లక్షలకోట్లు ప్రభుత్వానికి తరలించటం, ఎన్‌పిఎలు అధికంగా ఉన్న బ్యాంకులపై విధించిన ఆంక్షల సడలింపు, ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలకు మరింతగా రుణాలు లభ్యం చేయటం వంటి సమస్యలపై ప్రభుత్వ వైఖరితో ఆర్‌బిఐ విభేదించటం తెలిసిందే. దాన్ని తమ బాటలోకి తెచ్చుకునేందుకై ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్‌ 7ను ప్రయోగిస్తామనేంతవరకు ఆర్థిక మంత్రిత్వశాఖ వెళ్లటం వల్ల ఆర్‌బిఐపై పెత్తనానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే భావన బలపడింది. ఆర్‌బిఐపై అజమాయిషీకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలవల్ల తీవ్ర పర్యవసానాలుంటాయని డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య ఒక సభలో గతనెలలో బాహాటంగా హెచ్చరిక చేయటం కేంద్రప్రభుత్వం, ఆర్‌బిఐ మధ్య సంబంధాలు సజావుగా లేవన్న వాస్తవాన్ని బహిర్గతం చేసింది. కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లోటు పూడ్చుకోవటానికి, ఈ ఎన్నికల సంవత్సరంలో అదనంగా ఖర్చుచేయటానికీ ఆర్‌బిఐ నుంచి అదనపు నిధులు(రెగ్యులర్‌ డివిడెండ్‌ కాక) కోరుతుందన్న అభిప్రాయం బలపడుతుండటంతో, దానివల్ల చెడ్డపేరు వస్తుందని గ్రహించిన ఆర్థికమంత్రి, ఒకవైపు సెక్షన్‌ 7 ప్రయోగిస్తామని సంకేతాలిస్తూనే తాము అదనపు నిధులు కోరటం లేదని, దాని పెట్టుబడి చట్రంలో దిద్దుబాటు మాత్రమే కోరుతున్నామని కొద్దిరోజులక్రితం ప్రకటించారు.
వాస్తవానికి రిజర్వుబ్యాంక్‌ కేంద్రప్రభుత్వ బ్యాంక్‌. అయితే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ద్రవ్యసంబంధమైన (మానిటరీ) వ్యవహారాలపై దానికి పార్లమెంటు చట్టం ద్వారా నియంత్రణాధికారం, తన వ్యవహారాల నిర్వహణలో స్వయంప్రతిపత్తి ఇవ్వబడినాయి. ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు, విభేదాలు కొత్తేమీకాదు. కాకపోతే ఈ పర్యాయం ప్రభుత్వం కొంత మొరటుగా, పెత్తందారీతనంతో వ్యవహరించటంవల్ల అవి బజారుకెక్కాయి. సోమవారం బోర్డు సమావేశంలో కుదిరిన అంగీకారాలు ఇలా ఉన్నాయి ః ఒకటి, ఆర్‌బిఐ రిజర్వు నిధులను అదనంగా ప్రభుత్వానికి బదిలీచేసే అంశంపై ఒక కమిటీని నియమిస్తారు. దాని సిఫారసులు భవిష్యత్‌లో వనగూరే రిజర్వుకే వర్తిస్తాయి. రెండు, బ్యాంకుల పెట్టుబడి నియమాలను బాసెల్‌తో సమానంగా ఉంచే అంశంపై ప్రస్తుత విధానంలో మార్పు ఉండదు, కాని చివరికిస్తీ చెల్లింపును ఒక సంవత్సరం పొడిగించారు. మూడు, నిరర్థక ఆస్తులు భారీగా ఉన్న బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలు ఇవ్వకుండా ఆర్‌బిఐ విధించిన ‘సకాలంలో దిద్దుబాటు చర్య’ను సడలించి 11 బ్యాంకులకు వెసులుబాటు కల్పించే విషయాన్ని ఆర్‌బిఐ ఫైనాన్షియల్‌ సూపర్‌విజన్‌ బోర్డు పరిశీలిస్తుంది. నాలుగు, సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఇలు)రుణాల మంజూరును సులభతరం చేయటం, బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బిఎఫ్‌సిలు) ధనం లభ్యతకు ప్రత్యేక అవకాశం కల్పించటం అనే అంశంపై ఎంఎస్‌ఎంఇ రుణగ్రహీతల అప్పును రు.25కోట్లవరకు పునర్వ్యవస్థీకరించటం పరిశీలించబడుతుంది. అతిపెద్ద నాన్‌బ్యాంకింగ్‌ కంపెనీ అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బ్యాంకు రుణాల చెల్లింపులో డిఫాల్ట్‌ అయిన దరిమిలా ఎన్‌బిఎఫ్‌సిలు ఎదుర్కొంటున్న డబ్బు కొరత సమస్యను బ్యాంక్‌ పరిశీలిస్తుంది.
బ్యాంకుల్లో 10 లక్షల కోట్లకు పైగా మొండిబాకీలు పేరుకుపోవటం, పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వంటి కారణాలతో ఆర్థిక కార్యకలాపాలు అస్తుబిస్తు అయినాయి. అవి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నందున వాటికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆర్థిక వనరులు సమకూర్చాల్సి ఉంది. అయితే ఇవి మొండిబాకీలుగా మారకూడదు. అందువల్ల ఆర్‌బిఐ ఆచితూచి వ్యవహరించటం, అదే సమయంలో డబ్బు కొరత కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించకుండా చూడటం అవసరం. ఇది ద్రవ్య నిపుణులు నిర్వర్తించాల్సిన కర్తవ్యం. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చే స్వేచ్ఛను వారికివ్వటమే ఉత్తమమార్గం.

DO YOU LIKE THIS ARTICLE?