వందల కోట్ల రుణాలు ఎగ్గొట్టి…పరారైన రుణ ఎగవేతదారులు
నాలుగేళ్ల తర్వాత ఫిర్యాదు చేసిన ఎస్బిఐ
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలు చెల్లించకుండా విదేశాలకు పరారయ్యే దొంగల జాబితా పెరుగుతోంది. తాజాగా దేశీయ బ్యాంకులకు వందలాది కోట్ల రూపాయిల బకాయిలను ఎగవేసిన మరో స్కామ్ బట్టబయలైంది. కోట్లాది రూపాయల రుణాలను ఎగ్గొట్టి, నిందితులు దేశాన్ని వదిలి పరారైన ఉదంతం అలస్యంగా వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన బాస్మతీ బియ్యం ఎగుమతిదారు రామ్‌దేవ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యం, బ్యాంకుల కన్సార్టియంకు ఏకంగా రూ.414కోట్ల మేర రుణాలను ఎగవేసినట్లు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బిఐ) ఆరోపించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసింది. రామ్‌దేవ్ సంస్థ- ఎస్బిఐకి రూ.173.11 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ.76.09 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.64.31 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.51.31 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.36.91 కోట్లు, ఐడిబిఐ బ్యాంకుకు రూ.12.27 కోట్లు బకాయి ఉన్నట్టు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. నిందితులు వారి ఆస్తులలో చాలాభాగాన్ని అమ్మి, సొమ్ము చేసుకుని మరీ పరారయ్యారు. దీనితో బకాయిలు రాబట్టే అవకాశాలు దాదాపు శూన్యమని తెలియటంతో ఎస్బిఐ చివరకు సిబిఐని సంప్రదించింది. ఫిబ్రవరి 25న ఎస్బిఐ ఫిర్యాదు చేయటంతో కేంద్ర దర్యాప్తు విభాగం (సిబిఐ) రంగంలోకి దిగింది. సంస్థ డైరక్టర్లు నరేశ్ కుమార్, సురేశ్ కుమార్, సంగీత ఇంకా కొందరు గుర్తు తెలియని ప్రభుత్వాధికారులపై ఫోర్జరీ, మోసం, నమ్మక ద్రోహం, అవినీతి తదితర నేరాలపై ఏప్రిల్ 28న కేసులు నమోదు చేసింది. తాము 2016లో నిర్వహించిన ఓ ప్రత్యేక ఆడిట్ సందర్భంగా సంస్థ అవినీతి వ్యవహారం బయటపడినట్టు ఎస్బిఐ తెలిపింది. అయితే, ఈ నిందితులు పరారీలో ఉన్నట్టు ఆ సమయంలోనే తెలిసిందని తన ఫిర్యాదులో తెలిపింది. నకిలీ ఖాతాలు, మోసపూరితమైన బ్యాలన్స్ షీట్లు సమర్పించి రామ్ దేవ్ సంస్థ బ్యాంకు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు వివరించింది. తాము తనిఖీలు జరిపిన సమయంలో నిందితులు అందుబాటులో లేరని పేర్కొంది. అనంతర విచారణలో వారు దేశాన్ని విడిచి పారిపోయినట్లు తెలిసిందని ఎస్బిఐ ఆ ఫిర్యాదులో వెల్లడించింది. రామ్‌దేవ్ సంస్థ బకాయిలను 2016 నుంచి నిరర్థక ఆస్తులుగా ప్రకటించారు. ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయటంపై ఎస్బిఐ వివరణ కూడా ఇచ్చింది. నిందితులు పరారీలో ఉన్నట్టు ఒక సంవత్సరం క్రితం మాత్రమే నిర్ధారణ అయిందని చెప్పింది. రామ్‌దేవ్ ఇంటర్నేషనల్ సంస్థకు మరో కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ న్యాయస్థానం మూడుసార్లు వారెంట్లు జారీచేసిందని… ఈ సందర్భంగా జరిగిన విచారణలో నిందితులు దుబాయికి పారిపోయినట్టు డిసెంబర్ 2018లో వెల్లడయిందని పేర్కొంది.
బ్యాంకులకు రూ.411 కోట్ల కుచ్చుటోపీ!
RELATED ARTICLES