వామపక్ష విజయం!
లాపాజ్ : ఎర్రజెండా రెపరెపలతో అలరారే బొలీవియాలో వామపక్షాలు మళ్లీ అధికారంలోకి వస్తున్నాయి. అధికారిక ఓట్ల లెక్కింపునకు ముందు జరిగే అనధికార రాపిడ్ కౌంట్‌లో బొలీవి యా సోషలిస్టులే విజయభేరి మోగించినట్లు వెల్లడైంది. దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో ఆదివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి సోమవారం నాడు రెండు స్వతంత్ర సర్వే సంస్థలు ఎవరు గెలుస్తారన్న దానిమీద ముందస్తు రాపిడ్ కౌంట్స్‌ను వెల్లడించాయి. వీటిలో విజయం ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇవో మొరాల్స్ అనుంగు వారసుడైన లూయీస్ ఆర్సే వైపు మొగ్గు కనిపిస్తోంది. బొలీవియాలో అధ్యక్షుడిగా గెలవాలంటే అభ్యర్థి మొదటి రౌండులోనే 50% పైగా ఓట్లు పొందాలి. లేదా 40% ఓట్లు తెచ్చుకొని, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి కంటే కనీసం 10% ఆధిక్యత కనబరచాలి. ఈ రాపిడ్ కౌంట్స్ ప్రకారం ఆర్సే 50% కంటే ఎక్కువ ఓట్లతో, తన ప్రత్యర్థి మధ్యేమార్గానికి చెందిన మాజీ అధ్యక్షుడు కార్లోస్ మెసా కంటే సుమారు 20% పాయింట్లు ముందంజలో ఉన్నారు. దీంతో బొలీవియాలో అమెరికా దన్నుతో గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన మధ్యంతర ప్రభుత్వ మితవాద విధానాలను బొలీవియా ప్రజలు తిరస్కరించినట్లుగా కనిపిస్తోంది. అయితే సోమవారం నాడు పోలైన ఓట్లలో పావు వంతు లెక్కించారు. వాటిలో మాత్రం కార్లోస్ మెసా కొంత ముందంజలో ఉన్నారు. కానీ మొరాల్స్ పార్టీ మూవ్‌మెంట్ టు సోషలిజం (ఎంఏఎస్) కంచుకోటల ఫలితాలు ఇంకావెలువడాల్సి ఉంది. దీనికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వ అధ్యక్షుడు జీనైన్ ఆనేజ్ ‘ప్రజాస్వామ్యాన్ని గమనింపులో ఉంచుకొని బొలీవియాను పాలించండి’ అని ఆర్సేకు సూచించారు. ఆర్సే కూడా దేశంలో ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన మూవ్‌మెంట్ టువార్డ్ సోషలిజం పార్టీ జాతీయ ఐక్యతకు ప్రాధాన్యాన్ని ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించాడు. అయితే అధికారిక ఫలితాలు వెలువడటానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. కమ్యూనిస్టు నేత ఇవో మొరాల్స్ ప్రభుత్వంలో పదేళ్లకు పైగా ఆర్థిక మంత్రిగా పనిచేసిన లూయీస్ ఆర్సే అప్పట్లో బొలీవియాలో వృద్ధిలో పెరుగుదల, పేదరికం వేగంగా తగ్గడాన్ని చూశారు. ఇప్పుడు ఆయన వృద్ధిని గాడిలో పెట్టేందుకు పోరాటం చేయాల్సి ఉంది. ఖనిజాల ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం వల్ల బొలీవియా సాధించిన పురోగతి ఇప్పుడు మసకబారిపోయింది. తలసరి ప్రాతిపదికన చూస్తే ఏ దేశం కంటే కూడా కరోనా వైరస్ భూ పరివేష్ఠిత దేశం బొలీవియాను కటిక పేదరికంలోకి నెట్టింది. ఆ దేశపు కోటీ పదహారు లక్షల జనాభాలో దాదాపు 8,400 మంది కోవిడ్ 19కు బలైపోయారు. ఈ నేపథ్యంలో తన పూర్వపు నాయకుడి పొడవైన నీడ నుంచి అవతరించిన, బ్రిటన్‌లో చదువుకున్న ఆర్థికవేత్త అయిన 57 ఏళ్ల ఆర్సే బలమైన ఉద్యమాన్నే చేయాల్సి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆనేజ్ నాయకత్వంలోని అమెరికా ప్రేరేపిత మితవాద ప్రభుత్వం అంతకుముందు మొరాల్స్ అనుసరించిన విధానాలలో చాలావాటిని ఎత్తివేసేందుకు, వామపక్ష మిత్రులనుంచి దూరం జరిగేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా కొత్తగా నియమించిన ఎన్నికల అధికారులు మొరాల్స్‌ను ఆదివారం ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఒక్క స్థానానికి కూడా పోటీచేయకుండా నిషేధం విధించారు. కాగా, అంచనా ఫలితాలకు స్పందనగా ‘తొలి స్థానంలో ఉన్న అభ్యర్థికి, మా పార్టీకి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది, అందుకని ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉంచి, ఎన్నికల్లో విజేతను గుర్తించాల్సిన బాధ్యత మా మీద ఉంది’ అని మెసో పేర్కొన్నారు. ఇదిలావుండగా, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో మొరేల్స్ జరిపిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను బొలీవియాకు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అదెప్పుడన్నది మాత్రం చెప్పలేదు. తన అనుచరుడు ఆర్సేలానే ఆయన కూడా దేశ పునర్నిర్మాణానికి ఐకమత్యాన్ని చాటే ఒక గొప్ప సమావేశం అవసరం ఉందని మొరేల్స్ పేర్కొన్నాడు. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోమని ఆయన అన్నారు. కొత్త ప్రభుత్వంలో తన పాత్ర గురించి చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ఆర్సే దేశంలో ముంచుకువస్తున్న సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా బొలీవియాను పరిపాలించాలని రాజనీతి శాస్త్ర ఆచార్యుడు ఫ్రాంక్లిన్ పరేజా అభిప్రాయపడ్డారు. ఇవో మొరేల్స్ స్థానాన్ని వేరొకరితో భర్తీ చేయడం సాధ్యం కాకపోయినప్పటికీ, ఆర్సే ఆగమనం పార్టీ మూవ్‌మెంట్ టు సోషలిజానికి కొత్త శకం ప్రారంభించడమేనని పరేజా తెలిపారు.
బొలీవియాలో మళ్లీ
RELATED ARTICLES