న్యూఢిల్లీ : బొగ్గు కేటాయింపుల కుంభకోణం కేసులో బొగ్గు మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాకు శిక్షపడింది. కేంద్రంలోని ఆ నాటి యుపిఎ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ కుంభకోణం కేసులో బుధవారం ఢిల్లీ కోర్టు గుప్తాకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. మరో ఇద్దరు అధికారులు కెఎస్ క్రోఫా, కెసి సమ్రియాలకు కూడా మూడేళ్ల శిక్ష పడింది. అదే విధంగా ఈ ముగ్గురికి కూడా రూ. 50 వేల జరిమానాను విధించింది. అయితే జైలు శిక్ష నాలుగేళ్ల లోపే ఉండడంతో వారికి చట్టంబద్ధంగా బెయిల్‌ను మంజూరు చేసింది. దోషులుగా తేలిన మరికొంది వికాస్ మెటల్స్ పవర్ లిమిటెడ్ ఎండి వికాస్ పాట్ని, కంపెనీకి చెందిన మరో బాధ్యుడు ఆనంద్ మల్లిక్‌కు ప్రత్యేక జడ్జి భారత్ ప్రసార్ నాలుగేళ్ల జైలు శిక్షను విధించారు. మల్లిక్‌కు రూ. 25 లక్షలు, పాట్నికి రూ. 2లక్షల జరిమానాను కూడా వేశారు. అలాగే కంపెనీకి కూడా లక్ష రూపాయల ఫైన్ విధించారు. తీర్పు అనంతరం ఈ ఇద్దరిని జైలుకు తరలించారు. పశ్చిమ బెంగాల్‌లోని మొయిరా, మధుజోర్‌లో ఉన్న బొగ్గు గనులను విఎంపిఎల్‌కు కేటాయించిన సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2012 సెప్టెంబర్‌లో సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దోషులైన ఐదుగురికి ఏడేళ్ల జైలుశిక్ష, ప్రైవేట్ సంస్థ భారీ జరిమానా విధించాలని సిబిఐ కోరింది.
బొగ్గు కుంభకోణం కేసులో హెచ్‌సి గుప్తాకు మూడేళ్ల జైలు
RELATED ARTICLES