చైనా కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సభలో జిన్ పింగ్ స్పష్టీకరణ
బీజింగ్: పాతరోజులు పోయాయని, ఇప్పుడు బెదిరిస్తే భయపడేది లేదని, అణచివేతకు తలవొగ్గబోమని చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. ఇకపై చైనాను ఎవరూ లొంగదీసుకోలేరని కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన సభలో దేశ ప్ర జలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులకు గురైన యుగానికి శాశ్వతంగా తెరపడిందని అన్నారు. చైనాను బెదిరించడం అంటే కొండకు తల బాదుకోవడమేనని, అలాంటి తలలు పగిలిపోవడం ఖాయమని వైరి దేశాలకు ఆయన పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. చైనా సైనిక శక్తి ఎంతో బలంగా ఉందని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తుందని జిన్ పింగ్ అన్నారు. తన దేశాన్ని తక్కువ అంచనా వేయడం తగదని ప్రపంచ దేశాలకు హితవు పలికారు. జాతి సమైక్యతను, సమగ్రతను కాపాడుకోవడానికి చైనా ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని ఆయన అన్నారు. చైనాను హేళన చేయడానికిగానీ, ఆధిపత్యం చెలాయించడానికిగానీ ఎవరైనా ప్రయత్నిస్తే, 140 కోట్ల మంది ప్రజలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. వివాదాస్పదమైన తైవాన్ అంశాన్ని కూడా జిన్ పింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తైవాన్ ఏకీకరణ విషయంలో తమను ఎవరూ అడ్డుకోలేరని తీవ్ర కంఠంతో పేర్కొన్నారు. దేశాన్ని ఆధునాతన వ్యవస్థగా తీర్చిదిద్దడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. దేశాభివృద్ధికి పార్టీ చేసిన సేవలను ప్రశంసనీయమని జిన్ పింగ్ కొనియాడారారు. నల్లమందు యుద్ధాలను అడ్డుకోవడం నుంచి మొదలు పెడితే, సోషలిస్టు విప్లవం వరకూ చైనా ఎన్నో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొందని, అనేకానేక మలుపులు తిరిగి సురక్షిత వ్యవస్థను ఏర్పాటు చేసుకుందని జిన్ పింగ్ అన్నారు. జాతీయ పునరుజ్జీవంతో కోట్లాది మంది దేశ ప్రజలను పేదరికం నుంచి రక్షించిందని చెప్పారు. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రపంచ స్థాయి మిలిటరీని వ్యవస్థ నిర్మాణాన్ని కొనసాగిస్తానని జిన్ పింగ్ ప్రతిజ్ఞ చేశాడు. చైనా సర్వతోముఖాభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధిలో వేగాన్ని మరింతగా పుంజుకొని, ముందుకు దూసుకెళతామని అన్నారు.
బెదిరిస్తే భయపడం అణచివేతకు తలొంచం
RELATED ARTICLES