బెట్టింగ్‌ యాప్‌ల దందా!

దేశవ్యాప్తంగా ఇడి దాడులు
రూ. 46.96 కోట్ల బ్యాంకు ఖాతాలు స్తంభన

న్యూఢిల్లీ : దేశంలో బెట్టింగ్‌ యాప్‌ల దందా తీవ్రమైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) తాజాగా దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసి శనివారంనాడు మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ గాలింపు చర్యలు బయటపడిన 46.96 కోట్ల రూపాయల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. భారత్‌లో లెక్కలేనన్ని బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లు ప్రజలను తప్పుదారిపట్టించి, కోట్లాది రూపాయల మేరకు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నాయని ఇడి ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ బెట్టింగ్‌ యాప్‌లన్నీ చైనాకు చెందినవేనని తెలిపింది. ఢిల్లీ, గురుగాంవ్‌, ముంబయి, పూణేలలో 15 ప్రదేశాల్లో ఇడి అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. చైనీస్‌ బెట్టింగ్‌ యాప్‌లు నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన కార్యాలయాలపై ఈ దాడులు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆ ప్రకటనలో ధృవీకరించింది. ఒక జాతీయ దర్యాప్తు సంస్థ ఇటువంటి కంపెనీలపై దాడి చేయడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో ఆదాయపన్ను శాఖ కూడా హవాలా కుంభకోణాన్ని ఛేదించి, ఒక చైనా జాతీయుడ్ని, అతనికి సహాయం చేస్తున్న భారతీయులను పట్టుకుంది. తాజాగా ఇడి జరిపిన దాడుల్లో 17 హార్డ్‌డిస్క్‌లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు 46.96 కోట్ల రూపాయల హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఇడి ఈ మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేయడం విశేషం.

DO YOU LIKE THIS ARTICLE?