బెంగాల్‌ ఎన్నికలకు లెఫ్ట్‌ రెడీ

నేడే బ్రిగేడ్‌ పరేడ్‌ ర్యాలీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల సంగ్రామానికి వామపక్షాలు కాంగ్రెస్‌ కూటమి సిద్ధమైంది. కోల్‌కతా బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం జరిగే భారీ ర్యాలీతో వామపక్ష కూటమి బెంగాల్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి ప్రజావ్యతిరేక, మతవాద రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న సిపిఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి, కాంగ్రెస్‌ మధ్య ఇప్పటికే సీట్ల పంపకంపై ఒప్పం దం కుదిరింది. కాగా, 30 స్థానాల విషయంలో పీర్జాదా అబ్బాస్‌ సిద్దీఖీ నాయకత్వంలోని ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) మధ్య కూడా చర్చలు పూర్తయ్యాయి. కొన్ని స్థానాల విషయం లో విభేదాల పరిష్కారానికి కాంగ్రెస్‌, ఐఎస్‌ఎఫ్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాగా, ప్రజా సైన్యంగా (పీపుల్స్‌ బ్రిగేడ్‌) పేరుపెట్టిన ఈ ర్యాలీకి సిపిఐ(ఎం) అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. సామాజిక మాధ్యమాలు మొదలుకొని వీధుల వరకు కొత్త మార్గాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీ యువ కార్యకర్తలు కొన్ని వారాలుగా కోల్‌కతా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. ఇక “బ్రిగేడ్‌ ర్యాలీలో మేము ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడతాం. మతవాద శక్తులైన తృణమూల్‌, బిజెపి రెండింటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం” అని సీనియర్‌ సిపిఐ(ఎం) నాయకుడు ఎండి సలీం స్పష్టంచేశారు.
మతవాద శక్తులపై పోరు
ఇక ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ప్రసంగిస్తే బాగుండేది అని వామపక్షాలు, కాంగ్రెస్‌ భావించాయి. అయితే కేరళలో వామపక్షాలు, కాంగ్రెస్‌ ప్రత్యర్థులుగా ఉండటంతో దీనికి వారు దూరంగా ఉంటున్నారు. కాగా, ప్రజా వ్యతిరేక, మతవాద రాజకీయాలకు తమ కూటమే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ప్రదీప్‌ భట్టాచార్య స్పష్టంచేశారు. ఇంకా తృణమూల్‌, బిజెపి పేర్కొన్నట్లుగా ఈ ఎన్నికలు ద్విముఖ పోరు కాదని, త్రిముఖ పోరని భట్టాచార్య పేర్కొన్నారు. ఆదివారం ర్యాలీలో సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధీర్‌ చౌధురి, ఐఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు సిద్దీఖీ ప్రధాన వక్తలు. కాగా వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులతోపాటు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కూడా ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. ఇలా ఉంటే బిజెపి పుంజుకోవడంతో బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల ఓట్ల వాటా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో వామపక్ష కూటమికి ఐఎస్‌ఎఫ్‌ జతకలిసింది. బెంగాలీ ముస్లింలకు పవిత్ర స్థలాల్లో ఒకటైన ఫుర్‌ఫురా షరీఫ్‌ పీర్జాదా అయిన సిద్దీఖీ గత నెల ఐఎస్‌ఎఫ్‌ పార్టీని స్థాపించారు. తొలుత ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీతో సమావేశం అయిన ఆయన తర్వాత వామపక్ష కూటమి వైపు మళ్లారు.
నిర్ణాయక శక్తిగా వామపక్ష కూటమి
పశ్చిమ బెంగాల్‌ జనాభాలో 30% ఉన్న ముస్లింలు దాదాపు 100 110 స్థానాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్నారు. అలా ఎన్నికలు పోటాపోటీగా సాగితే వామపక్ష కూటమి బెంగాల్‌లో నిర్ణాయక శక్తిగా అవతరించే అవకాశం ఉంది. 2016 ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్‌ కలిసి పోటీచేశాయి. మొత్తం 294 స్థానాలకుగాను 77 చోట్ల గెలుపొందాయి. తర్వాత సిపిఐ(ఎం) బయటికి వెళ్లడంతో ఆ కూటమి విచ్ఛిన్నమైపోయింది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఒప్పందం కుదరకపోవడంతో ప్రతిపాదిత వామపక్ష కాంగ్రెస్‌ కూటమి ఉనికిలోకి రాలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా 2021 ఎన్నికల్లో కలిసి పోరాడాలని అవి నిర్ణయించుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో జరగనున్న పోలింగ్‌ మార్చి 27న మొదలవుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?