బిట్టు శ్రీను అరెస్ట్‌

ప్రజాపక్షం / పెద్దపల్లి ప్రతినిధి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతుల జంట హత్యల కేసులో మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెద్దపల్లి జడ్‌పి చైర్మన్‌, టిఆర్‌ఎస్‌ నేత పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి రవీందర్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యాయవాదులను హత్య చేసేందుకు వాహనాన్ని, ఆయుధాలను సమకూర్చినట్టు బిట్టు శ్రీనుపై అభియోగాలు ఉన్నాయి. కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌కు కారుతో పాటు, రెండు కత్తులను బిట్టు శ్రీనివాస్‌ సమకూర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా బిట్టు శ్రీనివాస్‌ పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు కావడంతో ఆయన అరెస్ట్‌ స్థానికంగా సంచలనంగా మారింది. మరోవైపు కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌, శివందు చిరంజీవి, బిట్టు శ్రీనివాస్‌లను పోలీసులు శుక్రవారం మంథని కోర్టులో ప్రవేశపెట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?