మూడు కీలక రాష్ట్రాల్లో కమలానికి షాక్
కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలకు బదిలీ అయిన ఓట్లు
న్యూఢిల్లీ: కీలక మూడు రాష్ట్రాల్లో బిజెపి భారీ గా ఓట్లను కోల్పోయింది. ఆ ఓట్లు కాంగ్రెస్‌కు మాత్రం దక్కలేదు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చినప్పుడు ఈసారి ఎన్నికల్లో బిజెపికి భారీ నష్టం జరిగింది. ఈ రాష్ట్రాల్లోని లోక్‌సభ సీట్లు 65లో నాడు 62 గెలుచుకున్న పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆసక్తికర విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్‌లో బిజెపి ఓట్ల వాటా కాంగ్రెస్‌కన్నా అధికం. రాజస్థాన్‌లో మాత్రం కాంగ్రెస్‌కన్నా కాస్త తక్కువ. తెలంగాణ, మిజోరంలో ప్రాంతీయ పార్టీలు గెలుపొందాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పాలకులే కీల కం కానున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బిజెపియేతర ప్రతిపక్షపార్టీలు ఐక్య కూడా ఇప్పటికే రూపొందించుకున్నా యి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇది 2013 అసెంబ్లీలో వచ్చిన 40.3 శాతం కన్నా ఎక్కువే. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన 38.37 శాతం కన్నా ఎక్కువే. నాడు ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ సీట్లలో ఒక్కటే గెలిచింది. దీనితో పోల్చినప్పు డు బిజెపి వాటా పెద్ద మొత్తంలో తగ్గింది. 2013లో 41% ఉండగా ఈసారి 33 శాతానికి తగ్గింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 49% ఓట్లు సాధించింది. 11 లోక్‌సభ స్థానా ల్లో 10 గెలుచుకుంది. చిన్నపార్టీలు, స్వతంత్రు లు మరిన్ని ఓట్లు గెలుచుకున్నారని ఓట్ల వాటా విశ్లేషకులు అన్నారు. బిఎస్పి 2013లో 4.3 శాతం ఓట్లు పొందింది. అయితే దాని మిత్రపక్షమైన మాజీ సిఎం అజిత్ జోగి పార్టీ ఇప్పుడు 11.5 శాతం ఓట్లు దక్కించుకుంది. పైగా ఛత్తీస్‌గఢ్‌లో మూడో పెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య పోటీ హోరాహోరిగా సాగింది. స్వతంత్రుల ఓటింగ్ వాటా 5.3 శాతం నుంచి 5.9 శాతంకి పెరిగింది. రాజస్థాన్‌లో బిజెపి ఓట్లు 2013లో 45.2 శాతం ఉండగా ఈసారి 38.8 శాతానికి పడిపోయింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో దానికి 55 శాతం ఓట్లు వచ్చాయి. నాడు లోక్‌సభ మొత్త 25 సీట్లను ఇక్కడ బిజెపి గెలుచుకుంది.