HomeNewsLatest Newsబిజెపియేతర రాష్ట్రాల్లో గవర్నర్ల పాలన

బిజెపియేతర రాష్ట్రాల్లో గవర్నర్ల పాలన

మోదీ ప్రభుత్వ విధానం రాజ్యాంగానికి, ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం
మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

ప్రజాపక్షం /హన్మకొండ
“మహిళలకు న్యాయం చేస్తాం. సబ్‌కె సాత్‌.. సబ్‌కా వికాస్‌” అని ప్రకటించిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పుడు తమ నినాదాన్ని మార్చుకుని ‘మాతో ఎవరుంటే.. మేము వారితో ఉంటాం” అనే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. అందులో భాగంగానే బిజెపి వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని గవర్నర్లతో పరిపాలిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం చేత నామినేట్‌ చేయబడిన గవర్నర్‌ ప్రజల చేత ఎన్నుకోబడిన కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతించడం అందుకు నిదర్శనమని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం రాజ్యాంగానికి, ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దమన్నారు. హన్మకొండలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాల సందర్భంగా శుక్రవారం హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపి సయ్యద్‌ అజీజ్‌పాషా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌, కలవేణ శంకర్‌, ఎం.బాలనరసింహా, కార్యవర్గ సభ్యులు బి.విజయసారధి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతిలతో కలిసి డాక్టర్‌ నారాయణ మాట్లాడారు. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య సంఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాడాన్ని డాక్టర్‌ నారాయణ స్వాగతించారు. వైద్యురాలి హత్యకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దోషిగా నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సంఘటన జరిగిన వెంటనే వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ అక్కడి నుంచి పారిపోయారని, మూడు రోజుల్లోనే అతనిని మరో చోట ప్రభుత్వం నియమించిందని, సంఘటన వెనుక ప్రభుత్వం పాత్ర లేకుంటే ఇదంతా ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. బిజెపి అనుకూల ప్రభుత్వాలు ఉన్న బిహార్‌, మహారాష్ట్రలలో ఏమి జరిగినా పట్టించుకోకపోవడం, మహిళలు, పిల్లలపై అత్యాచారాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. మోదీ ఊపిరి అదానీ చేతిలో ఉందని, బంగ్లాదేశ్‌లో అదానీ జోళికి వస్తే షేక్‌ హసీనా ప్రధాని పదవి ఊడిపోయినట్లే భారత్‌లో కూడా అదానీకి ఏమైనా అయితే మోదీ పదవి ఊడిపోతుందని, ఆ కారణంగానే అదానీని మోదీ ఉక్కు కవచాలతో కాపాడుతున్నారని నారాయణ అన్నారు. ప్రధాని మోదీ రాజ్యాంగబద్దమైన వ్యవస్థలను ధ్వసం చేస్తున్నారని ఇటీవల తనకు ఎయిర్‌పోర్ట్‌లో కలిసిన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధితో ప్రస్తావించగా “మా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థనే మోదీ ధ్ంవసం చేస్తున్నారు. ఆయనకు ఈ వ్యవస్థలు ఒక లెక్కా” అని వ్యాఖ్యానించారని నారాయణ వివరించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అంతర్గత సంక్షోభం నుంచి బయటపడేందుకు చంద్రబాబును మోదీ రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయిందని, చ్రందబాబు కూడా ఏమీ చేయలేనని చేతులెత్తేశారని, అయినా ఈ పరిస్థితుల్లో కూడా మోదీ ఒక నియంత మాదిరిగా దేశ ప్రజలపై యుద్దం ప్రకటిస్తున్నారన్నారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ స్వాగతిస్తున్నదని, అయితే వర్గీకరణకు, క్రిమిలేయర్‌కు సంబంధం లేదని, కోర్టులో విచారణ సందర్భంగా తాము ఈ విషయాన్ని తెలియజేస్తామన్నారు. చంద్రబాబు, నితీష్‌లపై ఆధారపడిన మోదీ ప్రభుత్వం చంద్రబాబు కోరిన అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటున్నారని, కానీ ఆ రెండు రాష్ట్రాలు కోరిన ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వలేదని, చంద్రబాబు, నితీష్‌లకు ఆ బానిస బతుకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. “తెలంగాణాలో ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బిజెపిలో బిఆర్‌ఎస్‌ విలీనమౌతుందని రేవంత్‌రెడ్డి చెబుతుండగా, రేవంత్‌రెడ్డి బిజెపిలో చేరుతారని బిఆర్‌ఎస్‌ నేతలు అంటూ రెండు పార్టీలు కలిసి రాజకీయ క్రీడ ఆడుతున్నారు. ఇది కాదు ప్రజలకు కావాల్సింది. అభివృద్ధి, సంక్షేమ చర్యలు కావాలి” అని నారాయణ అన్నారు. అభివృద్ధి విషయంలో సిఎం రేవంత్‌రెడ్డి వాగాడంబరం ఎక్కువైతే నష్టం జరుగుతుందని, పరిపాలన సరిగ్గా చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments