HomeNewsBreaking Newsబాలికపై అత్యాచారం

బాలికపై అత్యాచారం

ఆరుగురు నిందితుల అరెస్టు
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
ప్రజాపక్షం/రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డిఎస్‌ చౌహాన్‌ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ కేసు వివరాలను మంగళవారం ఎల్‌బినగర్‌ క్యాంపు కార్యాలయంలో చౌహాన్‌ మీడియాకు వెల్లడించారు. నిందితులపై పోక్సో యాక్టు, సెక్షన్‌ 5జి రెడ్‌విత్‌ 6 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు మంగళ్‌హాట్‌లో రౌడీషీటర్‌గా ఉన్నాడని తెలిపారు. ‘అష్రఫ్‌, చిన్నా, మహేశ్‌, తహిసీన్‌ అనే నలుగురు అత్యాచారాని పాల్పడిన తర్వాత రేసుకోర్సు వెనకవైపు ఉన్న ఫైజల్‌, ఇమ్రాన్‌ దగ్గరికి వెళ్లారు. వారి మొబైల్స్‌ తీసుకొని రెండు మూడు కాల్స్‌ చేసుకొని డిలీట్‌ చేశారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఉమ్నాబాద్‌ వరకు వెళ్లిపోయారు. అక్కడ రెండు పోలీసు బృందాలు గస్తీ నిర్వహిస్తుండటం చూసి.. తిరిగి వెనక్కి వచ్చేశారు. హైదరాబాద్‌ నగరంపై వారికి పూర్తి అవగాహన ఉండటంతో వారిని పట్టుకోవడానికి మొత్తం 12 బృందాలను వినియోగించాం. ఈ క్రమంలో వివిధ చోట్ల వారు పోలీసులకు చిక్కారు.” చౌహాన్‌ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌ లాల్‌బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో 15 రోజుల క్రితం తన సోదరుడి(14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పనిచేస్తుంటాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టారు. భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బెదిరించారు. పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు. మొత్తం ఏడు బృందాలలో గాలింపు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి డి ఎస్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎల్‌బినగర్‌ డిసిపి బత్తిని సాయిశ్రీ,తదితరులు పాల్గొన్నారు.
48 గంటల్లో నివేదిక ఇవ్వండి
బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆరా తీశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్‌… 48గంటల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సిఎస్‌, డిజిపి, రాచకొండ సిపిని ఆదేశించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు తక్షణమే బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ.. సహకారాలు అందించాలని గవర్నర్‌ ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments